ఆ పని చేయాల్సిందే.. లేదంటే 50 వేల మంది రైతులతో ముట్టడి

byసూర్య | Fri, Jul 26, 2024, 08:17 PM

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువని.. కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆగస్టు 2 లోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్న జలాశయాల్లో నీటిని నింపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే.. 50 వేల మంది రైతులతో తామే ప్రాజెక్టులను ముట్టడించి పంప్‌హౌస్‌లు ఆన్‌ చేస్తామని హెచ్చరించారు. . బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌ను కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే పంపులను ఆన్‌ చేయడం లేదని ఆయన విమర్శించారు.


రాష్ట్రంలో కరువు అనే మాట వినపడొద్దని కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరిచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. శ్రీరాంసాగర్‌ సామర్థం 90 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎల్‌ఎండీలో 5 టీఎంసీలు, మిడ్‌ మానేరులోనూ 5 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో అనేక జిల్లాల్లో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చునని తెలిపారు.


15 టీఎంసీలతో కొండ పోచమ్మ సాగర్‌ నిర్మించుకున్నామని.. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్ కట్టినట్లు చెప్పారు. లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చునని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ మెుండి వైఖరి కారణంగా దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీరు ఎటువంటి ఉపయోగం లేకుండా వృథాగా దిగువకు వెళ్లిపోతుందన్నారు. కాళేశ్వంరం దగ్గర గోదవారి ఉధృతంగా ప్రవహిస్తున్నా.. రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయన్నారు.


ప్రభుత్వం తలచుకుంటే 18 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చునని చెప్పారు. బస్వాపూర్‌, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌, మల్లన్న సాగర్‌ రైతులు సాగు నీటికోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆరు నెలలు రాజకీయం చేసినా.. నాలుగున్నరేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేద్దామని ప్రభుత్వానికి సూచించారు. నీటిని లిఫ్ట్‌ చేస్తే రెండు రోజుల్లోనే మిడ్‌ మానేరుకు నీరు చేరుతుందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి పంప్‌హౌస్‌లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో పరిధిలో రిజర్వాయర్లలో నీటిని నింపడానికి రేవంత్ ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో తామే పంపులు ఆన్‌ చేసి బీడు భూములకు నీళ్లందిస్తామన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM