తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త పథకం, పాడి పశువులు, కోళ్ల ఫారాలు

byసూర్య | Mon, Jul 08, 2024, 09:50 PM

మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మహాలక్ష్మీ పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. అలాగే ఇదే పథకం కింద రాష్ట్రంలోని ఒక్కో మహిళ అకౌంట్‌లో రూ. 2500 జమ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు. తాజాగా.. మహిళను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు గాను మహిళా శక్తి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా.. పథకం కింద తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు పౌల్ట్రీ ఫారాలు, పాడి పశువులు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. మహిళలు ఆయా యూనిట్ల నిర్వహించేందుకు గాను బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం రూపంలో ఆర్థిక సాయం అందించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాలని తాజాగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.


ఈ పథకం కింద కోళ్ల ఫారాలు పెంచేందుకు గాను.. ప్రతి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున యూనిట్ మంజూరు చేయనున్నారు. ప్రతి యూనిట్‌కు రూ.2.91 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే వారిని ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. నాటుకోళ్ల పెంపకం యూనిట్లును ఒక్కో జిల్లాలో రూ.3 కోట్లతో రెండువేల మందికి వీటిని మంజూరు చేయనున్నారు. మహిళా స్వశక్తి సంఘంలోని సభ్యురాళ్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రుణం మంజూరు చేస్తారు. ఈ పథకం కింద 20 లేదా 50 లేదా 100 దేశవాళీ కోళ్లను మహిళలు తమ ఇంటి వద్దే పెంచుకోవచ్చు.


పాడిపశువుల యూనిట్లను ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్లతో 500 మంది మహిళా సమాఖ్యల సభ్యురాళ్లకు మంజూరు చేయనున్నారు. రూ.90 వేల రుణ సాయంతో సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఒకటి లేదా రెండు పాడి పశువులను కొని వారికి అందిస్తారు. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. గ్రామ పరిధిలోని మహిళా సమైక్య సంఘంలో వారు కచ్చితంగా సభ్యురాలై ఉండాలి. పశువుల పెంపకానికి, వాటి జీవనానికి అనువైన వాతావరణం ఉన్న గ్రామాల్లోని వారికే ఈ యూనిట్లు మంజూరు చేస్తారు.


ప్రతి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు మిల్క్‌పార్లర్లు మంజూరు చేస్తారు. బస్టాండ్లు, సినిమాథి యేటర్లు, రైతు బజార్లు, రైల్వే స్షేషన్లు ఉండే ప్రాంతాల్లోని సంఘాల సభ్యురాళ్లకు ఈ పథకం కింద అవకాశం కల్పిస్తారు. ఒక్కో మిల్క్ పార్లర్‌ ఏర్పాటుకు రూ. 1.90 లక్షల చొప్పున రుణం మంజూరు చేస్తారు. ఈ పథకం కింద సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మంజూరు చేస్తారు. ఒక్కో యూనిటుకు రూ.10 లక్షల చొప్పున మండలానికి ఒకరికి ఈ యూనిట్‌ మంజూరు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య్స సంపత్‌ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM