byసూర్య | Sat, Jun 22, 2024, 08:05 PM
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని సగం పార్లమెంట్ స్థానాలను గెలిచి ఊపుమీదున్న బీజేపీ.. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో వేరొకర్ని నియమించనున్నారు. కొత్తవ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది. ఈ క్రమంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ కోరారు. అంతేకాదు, పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం.
తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజెందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోన్న వేళ.. రాజాసింగ్ వీడియో కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) నుంచి 2003లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్.. సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణకు తొలి ఆర్ధిక మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటల.. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో విబేధాల కారణంగా టీఆర్ఎస్‌కు 2021లో రాజీనామా చేవారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన బీజేపీలో చేరారు.
వామపక్ష భావజాలం కలిగిన ఈటలను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేయడం పరోక్షంగా ఈటల అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారనే చర్చ మొదలైంది. ఒకవేళ, ఎంపీగా గెలిచిన వ్యక్తిని పార్టీ చీఫ్‌గా నియమించాలనుకుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇవ్వాలనేది రాజాసింగ్ ఆంతర్యమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హిందూత్వ భావజాలం కలిగిన అర్వింద్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అర్వింద్‌కు రాజాసింగ్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. రాజాసింగ్ వీడియోపై ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్ఠానం తెలంగాణ కొత్త అధ్యక్షుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.