ఎకరానికి రూ. 15 వేలు పంట సాయం.. మంత్రి తుమ్మల కీలక అప్టేట్, వారికి మాత్రమేనట

byసూర్య | Sat, Jun 15, 2024, 08:31 PM

రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేల సాయం అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు రూ. 10 వేల సాయం అందించగా.. తాము అధికారంలోకి వస్తే రెండు విడతల్లో రూ. 15 వేల సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా... రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పంట సాగు చేపట్టిన రైతులు ఎప్పుడెప్పుడు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.


ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్టేట్ ఇచ్చారు. ఈ పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటామని.. అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించిందని.. సాగులో లేని భూములకు కూడా డబ్బు ఇవ్వటంతో ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. అందుకే సాగు చేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని తుమ్మల చెప్పారు.


రైతుభరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని.. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సరళతరం చేస్తామన్నారు. రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని తుమ్మల వెల్లడించారు. విడతల వారీగా మాఫీ చేయటం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉందన్నారు. ఈ అంశంపైనా త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని తుమ్మల వెల్లడించారు.


ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని.. కంపెనీలపై ఒత్తిడి పెంచి తగినన్ని విత్తనాలను జిల్లాలకు పంపించామని చెప్పారు. అందరూ ఒకే రకం విత్తనం కావాలనటం వల్ల సమస్య ఏర్పడుతోందన్నారు. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే విధంగా దిగుబడి ఇస్తాయని.. నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు.



Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM