కారు ప్రమాదంలో భార్య, ఇద్దరు చిన్నారులు మృతి.. భర్తపై అనుమానాలు

byసూర్య | Wed, May 29, 2024, 07:42 PM

ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి పూట ప్రమాదం జరగ్గా.. కుమారితో పాటు ఆమె కుమార్తెలు.. కృషిక, తనిష్క ప్రాణాలు కోల్పోయారు. ఇక అదే ప్రమాదంలో కుమారి భర్త ప్రవీణ్ స్వల్పంగా గాయపడగా.. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదంపై కుమారి తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమారి, ఆమె పిల్లలను ప్రవీణే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి, కుమార్తెలు కృషిక, తనిష్కతో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. కారుకి అడ్డొచ్చిన కుక్కను తప్పించే క్రమంలో అదుపుతప్పి.. రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు వెంట వెళ్తున్నవారు ఈ ప్రమాదాన్ని గమనించి.. కారులోని వారిని బయటకు తీయగా... అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న కుమారిని అంబులెన్సులో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


కుమారి తండ్రి హరిసింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న కుమారి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కుమారి, పిల్లల మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.


ప్రవీణ్‌.. హైదరాబాదులో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తె కుమారితో పెళ్లి జరిగింది. ప్రవీణ్‌కు రూ.24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని హరిసింగ్‌ తెలిపారు. అయితే... ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారంటూ ప్రవీణ్ తరుచూ తమ కుమార్తెను వేధించేవాడని.. ఈ క్రమంలోనే కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ కీలక ఆరోపణ చేశాడు. సుమారు 10 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్‌ 20 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడని తెలిపారు. పది రోజుల క్రితం కుమారి, తన పిల్లలతో హైదరాబాద్‌ నుంచి బాబోజితండాకు రాగా... 25వ తేదీన వారి పెళ్లి రోజు సందర్భంగా కేక్‌ తెమ్మన్నా ప్రవీణ్‌ తేలేదని హరిసింగ్‌ తెలిపారు.


ఈ క్రమంలోనే కారు ప్రమాదంలో కుమారి ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోవడం.. పిల్లల శరీరంపై చిన్న గాయం కూడా లేకపోవడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే ప్రవీణ్‌ని ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి ప్రవీణ్‌ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM