జార్ఖండ్ ఎన్నికల్లో 'నల్గొండ' వృద్ధుడు.. 87 ఏళ్ల వయసులో పోటీ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

byసూర్య | Wed, May 22, 2024, 07:21 PM

జార్ఖండ్‌లో జూన్ 1వ తేదిన జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలో తెలంగాణకు చెందిన ఓ రిటైర్డ్ పశువైద్యుడు పోటీ చేస్తున్నారు. అది కూడా 87 ఏళ్ల వయసులో. నల్గొండ జిల్లాలోని ఇల్లూరు అనే మారుమూల గ్రామానికి చెందిన 87 ఏళ్ల కంచర్ల రంగయ్య.. జార్ఖండ్‌లోని గొడ్డ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే.. ఇది మొదటిసారి కాదండోయ్.. రెండో సారి. రంగయ్యకు వయసు మీదపడి నేపథ్యంలో.. నడవలేకపోతున్నారు. వినికిడి సమస్య కూడా ఉంది. అయినప్పటికీ.. లోక్ సభ బరిలో నిలవాలన్న సంకల్పానికి ఇవేవి తనకు అడ్డంకులుగా మారలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా గొడ్డ నుంచే ఎంపీగా పోటీ చేసిన రంగయ్యకు.. 16,456 ఓట్లు పోలవటం గమనార్హం. అదే స్ఫూర్తితో ఈసారి కూడా తాను బరిలో దిగుతున్నారు.


అయితే.. తన స్వగ్రామం నుంచి ఏకంగా 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడ్డ లోక్ సభ స్థానం నుంచే రంగయ్య ఎంపీగా పోటీ చేయటం వెనుక పెద్ద కథే ఉంది. తాను తన ఉద్యోగం నుంచి రిటైరయ్యాక.. తన సొంత నియోజకవర్గమైన నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రంగయ్య నామినేషన్ వేశారు. పలు కారణాలతో రంగయ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. అప్పుడు.. నల్గొండ నుంచి ఎన్నికలకు సంపన్నులను మాత్రమే పరిగణిస్తారని రంగయ్య భావించారు. అప్పటి నుంచి తన పరిశోధన ప్రారంభించారు.


ఈ క్రమంలోనే.. అక్షరాస్యత, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు చాలా విషయాల్లో దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో 'గొడ్డ' ఒకటని రంగయ్య గుర్తించారు. అక్కడ.. ఇప్పటికీ ఆవు పేడతో చేసిన పిడకలనే వంట చెరుకుగా ఉపయోగిస్తుండటం.. రంగయ్యను కదిలించినట్టు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితమే అందరూ వదిలేసిన ఈ పద్దతిని ఇంకా పాటిస్తున్నారంటే.. అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారరు.


ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన రంగయ్య.. ముంబైలో వెటర్నరీ మెడిసిన్‌లో మాస్టర్స్‌ చేశారు. గవర్నమెంట్ వెటర్నటీ డాక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రంగయ్య.. తన శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. ఎన్నికల్లో డబ్బులకు, మద్యానికి ఓటేసే పద్ధతి మార్చాలని కంకణం కట్టుకున్నారు రంగయ్య.


రంగయ్య ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అతనికి 2008 మోడల్ టాటా ఇండికా కారు, 500 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయి. వాటి విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని అంచనా. ఇక.. అతని భార్య విజయలక్ష్మి వద్ద 200 గ్రాముల బంగారం ఉంది. అఫిడవిట్ ప్రకారం వ్యవసాయ భూమిని కౌలుకు ఇవ్వటం ద్వారా అతనికి ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


గొడ్డ నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రంగయ్య.. జనవరి నుంచే తన భార్య విజయ లక్ష్మి (75)తో కలిసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వామి వివేకానంద, స్వామి రామకృష్ణ పరమహంస రచనలే తనను ప్రజా సేవ చేయడానికి ప్రేరేపించాయంటున్నారు కంచర్ల రంగయ్య. మాండూక్య ఉపనిషత్తు కూడా తనపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్తున్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM