byసూర్య | Mon, May 20, 2024, 10:00 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. గుజరాత్‌లోనూ పేదరికం పెరిగిందన్నారు. దేశమంతా అంధకారంలోకి వెళ్లిందన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో పాకిస్థాన్ గురించి మాట్లాడుతుందని ఆరోపించారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు. తెలంగాణలోనూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతోందని విమర్శించారు. కోమటిరెడ్డి వంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడటం వృథా అని... ఆయన నిలకడనలేని వ్యక్తి అని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా నాలుగుసార్లు గెలిచిందని... ఈసారి కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రుణమాఫీ చేస్తామని మభ్యపెడుతున్నారన్నారు. బీసీ గణన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట మార్చిందని ఆరోపించారు. యువత ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేస్తే అపాయింట్‌మెంట్ కాపీలను పంచుతూ రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. పార్టీల అభ్యర్థులను చూసి ఓటు వేయాలని... పోరాటం చేసేవారిని ప్రోత్సహించాలని కోరారు.