ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన

byసూర్య | Fri, May 17, 2024, 09:12 PM

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక.. ఎన్నికలకు ముందు.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిని బయటకు తీయటమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ మీద దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడగానే.. ఒక్కో శాఖపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి వాటిపై అసెంబ్లీలో శ్వేత పత్రాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే.. విద్యుత్ శాఖలో జరిగిన అవతవకలపై విచారణ చేసేందుకు ఓ కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే.. లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. విచారణ కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికలు ముగియటంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ రంగంలోకి దిగింది.


యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు.. ఛత్తీస్గఢ్తో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో అవకతవకలపై ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయగా.. ఈమేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే 10 రోజుల్లో తమకు తెలియజేయాలని కమిషన్ కోరింది.


2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్‌ డిస్కమ్స్ నుంచి విద్యుత్‌ సేకరణకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏమైన సమాచారం ఉంటే తెలియజేయాలని కమిషన్ కోరింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్‌ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం.. రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి 7 ఏళ్లు తీసుకోవడం వెనుక ఉన్న లోసుగులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరింది. డిస్కంలపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్‌ స్టేషన్‌ను దామరచర్లలో నిర్మించడానికి కారణాలు తెలిస్తే చెప్పాలంది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా, నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదర్చుకోవడంపై సాక్ష్యాలు ఉంటే తెలపాలని కమిషన్ పేర్కొంది.


కరెంటు కొనుగోలులో అవకతవకలు, బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించిన ఆధారాల ఉంటే తమకు ఈ-మెయిల్ ద్వారా తెలుపాలని కమిషన్ కోరింది. ఒకవేళ ఈ-మెయిల్ ద్వారా పంపడం ఇబ్బంది అనుకుంటే.. బీఆర్కే భవన్‌కు పోస్టు ద్వారా కూడా ఆధారాలు పంపించవచ్చని సూచించింది. ఎలాంటి సమాచారమైనా పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషన్ పేర్కొంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహిస్తామని జస్టిస్ నర్సింహా రెడ్డి తెలిపారు. విద్యుత్‌‌ ఉద్యోగులు సైతం బహిరంగ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందిచొచ్చన్నారు. వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణ నిర్వహిస్తామని.. ఇందుకు అందరూ సహకరించాలని జస్టిస్ నర్సింహా రెడ్డి కోరారు.


Latest News
 

వ్యాపారి ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం..! చోరీ చేసేందుకు ముఠా స్కెచ్, చివరకు Tue, Jun 18, 2024, 09:24 PM
కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్ Tue, Jun 18, 2024, 09:19 PM
రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట Tue, Jun 18, 2024, 08:19 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు Tue, Jun 18, 2024, 08:18 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన... ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్ Tue, Jun 18, 2024, 08:16 PM