ఓయూ విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా చదువుకోండి: భట్టి విక్రమార్క

byసూర్య | Mon, Apr 29, 2024, 08:50 PM

ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా విద్యార్థినిలు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తుండగా.. ఈరోజు ఓయూ చీఫ్ వార్డెన్ ఓ ప్రకటన చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓయూలో విద్యుత్ కోతలు, నీటి కష్టాల కారణంగా మే 1వ తేదీ నుంచి హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నామంటూ.. ప్రకటన జారీ చేశారు. కాగా.. ఈ నోటీసులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, నీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై విచారణకు ఆదేశించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. వెనువెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నీటి కొరత కారణంగా మే ఒకటి నుంచి.. 31 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని.. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి.. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.


ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక 11కేవీ ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీ మొత్తానికి విద్యుత్తు సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్‌ల ద్వారా స్పష్టమైనట్టు అధికారులు పేర్కొన్నట్టు తెలిపారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్‌కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు భట్టి తెలిపారు.


యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్తు, నీటి సదుపాయాలను వెనువెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చన్నారు. ఖాళీ చేయాల్సిన అవసరం విద్యార్థులకు ఏమాత్రం లేదన్నారు.


గత ప్రభుత్వం అలవాటు మాదిరిగానే ఈ ఏడాది అధికారులు ప్రకటన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. గతేడాది జారీ చేసిన ప్రకటన తమ వద్ద ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.


Latest News
 

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ధరలు Thu, May 16, 2024, 03:08 PM
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ Thu, May 16, 2024, 03:05 PM
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి Thu, May 16, 2024, 03:01 PM
రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవా?: కేటీఆర్‌ Thu, May 16, 2024, 01:55 PM
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM