ఓయూలో నైట్ వాచ్‌మెన్‌‌గా పనిచేస్తూ.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!

byసూర్య | Fri, Mar 01, 2024, 07:53 PM

చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆ యువకుడి సంకల్పానికి పేదరికం తలవంచింది. ప్రతిభకు పట్టుదల, నిరంతర కృషి తోడైతే కానిది ఏదీలేదని నిరూపించాడు. తల్లిదండ్రులు సంపాదన అంతంత మాత్రం కావడంతో వారిపై ఆధారపడకుండా నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. పరీక్షల్లో సత్తా చాటి... ఇటీవల విడుదలై ఫలితాల్లో ఏకంగా మూడు కొలువులు సాధించాడు. అతడే మంచిర్యాల జిల్లాకు చెందిన గొల్లె ప్రవీణ్. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్‌ మల్టీమీడియా రిసర్చ్‌ సెంటర్‌ (ఈఎంఆర్‌సీ)లో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ పదిరోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు.


ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్‌ గ్రామానికి చెందిన పెద్దులు, పోసమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్. పెద్దులు తాపీ మేస్త్రీ కాగా.. పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు కష్టపడి తమ కుమారుడు ప్రవీణ్‌ను చదివించారు. తమలాగా కొడుకు కష్టపడకూడదని భావించారు. వారు ఆశలకు అనుగుణంగానే ప్రవీణ్ చదువుల్లో ముందుండేవారు. జెన్నారంలో డిగ్రీ పూర్తిచేసి.. ఓయూ క్యాంపస్‌లో ఎంకాం, బీఈడీ, ఎంఈడీ కోర్సులను పూర్తిచేశాడు. అయితే, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకూడదనే ఉద్దేశంతో ఈఎంఆర్‌సీలో నైట్ వాచ్‌మన్‌గా ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.


ఇటీవల విడుదల గురుకుల ఉపాధ్యాయ ఫలితాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపికయ్యారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల తుది జాబితాలోనూ నిలిచాడు. ఈ మూడింటిలో జూనియర్ లెక్చరర్ పోస్టునే ఎంచుకుంటానని ప్రవీణ్ చెప్పారు. ఎంకామ్, బీఎడ్, ఎంఎడ్ తర్వాత ఓయూలో ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన నైట్ వాచ్‌మెన్ ఉద్యోగంలో చేరినట్టు తెలిపారు. తద్వారా తనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించిందని చెప్పాడు. ‘నేను ఉద్యోగం చేస్తున్నానని ఎప్పుడూ అనిపించలేదు.. నాకు ఒక గది, అందుబాటులో పుస్తకాలు, మెటీరియల్‌.. చదువుకోవడానికి సమయం దొరికింది’ అని పేర్కొన్నాడు. నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం కావడంతో పగలు ఎక్కువ గంటలు ప్రిపరేష‌న్‌కు అవకాశం ఏర్పడిందన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM