బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ.. పేలిన బస్సు టైరు.. నేతలకు తప్పిన ప్రమాదం

byసూర్య | Fri, Mar 01, 2024, 07:49 PM

కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీతోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి.. కుంగిన పిల్లర్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ నేతలు ‘ఛలో మేడిగడ్డ’ పేరిట బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తోన్న ఒక బస్సు టైర్ పేలింది. జనగామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి.. టైర్ మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదం తప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.


కాగా మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల వాహనాలను వరంగల్ దేవన్నపేట్ క్రాస్ రోడ్డు దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు దారి వెంబడి నిలబడి.. బీఆర్ఎస్ వాహన శ్రేణికి స్వాగతం పలికాయి. మేడిగడ్డ బ్యారేజీలో ఒకట్రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని.. కాంగ్రెస్ పార్టీ చిన్న లోపాన్ని భూతద్దంలో చూపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టడం కోసమే ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు హస్తం పార్టీ కుట్ర పన్నుతోందన్న ఆయన.. ఆ కుట్రలను ఎండగట్టడం కోసమే తాము మేడిగడ్డ వెళ్తున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిరక్షించాల్సిందిపోయి.. అది కూలిపోవాలని కాంగ్రెస్ చూస్తోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తాము మేడిగడ్డ యాత్ర చేపట్టామని కేటీఆర్ తెలిపారు.


మేడిగడ్డ పర్యటన బయల్దేరడానికి ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమపై కోపాన్ని రైతులపై చూపించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. పంటలు ఎండుతున్నాయని.. తక్షణమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయడానికి ఇబ్బంది ఏంటని ఆయన రేవంత్ సర్కారును ప్రశ్నించారు. వెంటనే రిపేర్ చేయకపోతే.. వర్షాకాలంలో వరదలకు బ్యారేజీ కొట్టుకుపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM