ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. వైఎస్ఆర్ వల్లే ఇదంతా అంటూ అనుచిత కామెంట్లు

byసూర్య | Fri, Feb 23, 2024, 09:28 PM

ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడ్‌తో ప్రయాణిస్తూ.. ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వాహనాన్ని నడిపిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో ఔటర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. రింగ్ రోడ్డును వంకర్లు తిప్పారని.. అందుకే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రింగ్ రోడ్డు నిర్మాణం మొదలైంది. అయితే తమ పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు, తమ వారి భూములు రింగ్ రోడ్‌లో పోకుండా ఉండటం కోసం ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను వైఎస్ ప్రభుత్వం మార్చిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పటాన్‌చెరు ప్రాంతంలో ఓఆర్ఆర్ ఎంత వంకరగా ఉందో చూడండంటూ.. గూగుల్ మ్యాప్‌ స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తున్నారు. వైఎస్ తిప్పిన మలుపులే ఓఆర్ఆర్ మీద చావులకు కారణం అంటూ దివంగత నేతపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.


పెద్ద రైతులు, పలుకుబడి ఉన్న నేతలు, రియల్టర్లు తమ ప్రయోజనాల కోసం రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మార్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రింగ్ రోడ్ నిర్మాణంలో అనేక అవాంతరాలు తలెత్తాయి. భూసేకరణను నిలిపేయాలని కోరుతూ భూమి యజమానులు కోర్టుకెక్కడంతో 115సార్లు అలైన్‌మెంట్ మార్చాల్సి వచ్చింది. ఏడునాగులపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ను క్రాస్ చేయాల్సి ఉండటంతో.. కొల్లూరు, పటాన్‌చెరు మధ్య 11.7 కి.మీ. ప్యాకేజీలో రైల్వే శాఖ నుంచి సమస్యలు ఎదురయ్యాయి.


జంట జలాశయాలు ఉన్న దగ్గర.. 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ నగరం లోపలికి చొచ్చుకొచ్చినట్టు ఉండగా.. పటాన్‌చెరు దగ్గర మాత్రం నగరానికి దూరంగా ఉంటుంది. ఇటువైపు నగరం విస్తరణకు అవకాశం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.


పైగా లాస్య నందిత ప్రయాణిస్తోన్న వాహనాన్ని నడిపిన వ్యక్తి తప్పిదమే ప్రమాదానికి ప్రధాన కారణం. అధిక వేగంతో వెళ్తున్న వాహనం నాలుగో లైన్లోకి వచ్చిందంటే దానికి డ్రైవర్ నిద్రమత్తు కారణం కావచ్చు. ఎమ్మెల్యే మధ్య సీట్లో కూర్చున్నప్పటికీ.. ఆమె సీట్ బెల్ట్ ధరించలేదు. ఇదే ఆమె మరణానికి ప్రధాన కారణమని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది. కానీ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా.. వైఎస్ హయాంలో అలైన్‌మెంట్లు మార్చడంతోనే ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించడం అనేది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అనిపించకమానదు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM