చంద్రబాబు అరెస్టు అక్రమం.. నిరసన దీక్ష చేస్తా: బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి ఫైర్

byసూర్య | Sat, Sep 23, 2023, 06:58 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా.. రేపు (సెప్టెంబర్ 24) ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని చెప్పారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తానని వెల్లడించారు. ఇవాళ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును జైలులో ఉంచి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని.. ఆయనకు ఏమైనా జరిగితే జగన్‌దే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. వైఎస్‌ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదని.. జగన్ ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు.


2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ నుంచి తాను మాట్లాడుతూ జగన్ గెలవాలని ప్రచారం చేశానని గుర్తు చేశారు. తన పిలుపుతో ఏపీలోని దళిత వర్గాలు, పేద వర్గాలన్నీ ఏకమై జగన్‌ను గెలిపించాయన్నారు. అధికారంలోకి వచ్చిన తెల్లారే జగన్ మైకంలోకి వెళ్లాడని మండిపడ్డారు. ఆ మైకం ఎంత వరకు వెళ్లిందంటే... తల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాడని.. చెల్లెలు షర్మిలను మెడబట్టి బయటకు గెంటేశాడని ఆక్షేపించాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే బాగా పాలిస్తాడని ప్రజలు నమ్మితే.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్‌లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా ? ప్రశ్నించారు. వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నావా ? అని నిలదీశారు. జగన్ పాలించే రాష్ట్రంలో రాజధానే లేదని.. 151 సీట్లు ప్రజలిస్తే అది అహంకారంలోకి వెళ్లిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడని మాట్లాడిన వాడినల్లా కొట్టి, తిట్టి, భయపెట్టి నియంత మాదిరి జగన్ రాజ్యమేలుతున్నాడని మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కేబినెట్‌లో పని చేసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్‌ కూడా అక్రమ అరెస్టును ఖడించాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు.


చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తాను రేపు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న మోత్కుపల్లి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత చంద్రబాబుపై విమర్శలు చేసి వైఎస్ఆర్‌సీపీకి పని చేశారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM