ఆ కలెక్టర్ ను చూస్తే వారికి దడదడ

byసూర్య | Fri, Jan 17, 2020, 02:40 PM

ఆయనకు విధి నిర్వహణ అంటే ప్రాణం. ఏ మాత్రం అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా సహించడు. నీతి నిజాయితికి ఆయన మారు పేరు. యంగ్ అంగ్ డైనమిక్ కలెక్టర్ గా పేరు సంపాదించారు. విద్య, వైద్యం, ఉపాధికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. ఆకస్మిక తనిఖీలు చేసి ఉద్యోగులకు హడల్ పుట్టిస్తారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తారు. ఎవరు చెప్పినా వినడు. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనే ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్.


రొనాల్డ్ రోస్ తమిళనాడులోని ఓ మామూలు మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తన విద్యాభ్యాసమంతా తమిళనాడులోనే జరిగింది. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి 2006లో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. శిక్షణ తర్వాత ఉమ్మడి ఏపీని తన కేడర్ గా ఎంచుకున్నాడు. వివిధ ప్రాంతాలలో పని చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నాడు. నిజామాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేశాడు.


ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా రొనాల్డ్ రోస్ పని చేస్తున్నారు. రోస్ కు ముక్కుసూటి మనిషిగా పేరుంది. ఆయన అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. ఎక్కడ పని చేసినా ప్రజల అభిమానాన్ని చురగొన్నాడు. విద్య, వైద్యం, ఉపాధికి రోస్ ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. ఆయన కలెక్టర్ అయినా సాదాసీదాగా ఉంటాడు.


మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాక రొనాల్డ్ రోస్ పలు కీలక మార్పులు తీసుకువచ్చారు. జిల్లాలో బడీడు పిల్లలు బడికి దూరమవుతున్నారని, బడికి వచ్చే వారు మానసికంగా వెలితితో ఉంటున్నారని రొనాల్డ్ రోస్ గుర్తించారు. వీటి కారణంగానే వారికి చదువు రాకుండా పోతుందని గమనించాడు. దీన్ని నివారించేందుకు రొనాల్డ్ నిర్ణయించుకున్నారు. జిల్లాలో మంచి విద్య, మానసిక స్థితి, చిన్నప్పటి నుంచే పలు విషయాల్లో చిన్నారులకు శిక్షణ తదితర అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్వయంగా దీనిపై రంగంలోకి దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో విద్యనందించడం, విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం కల్పించడం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా పలు విధానాలను అమలు చేస్తున్నారు.


జిల్లాలో బ్రైటర్ మైండ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది కేవలం పట్టణాలకే పరిమితమైన శిక్షణ. అటువంటి దానిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పేద పిల్లలకు అందేలా చేయగలిగారు. బ్రైటర్ మైండ్ 30 గంటల శిక్షణకు రూ.13 వేలు. చిన్నప్పటి నుంచే ప్రతి అంశంలో విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి.. మానసికంగా దృఢంగా చేసే బ్రైటర్ మైండ్‌ను పాలమూరుకు తీసుకువచ్చారు. దీని కోసం కలెక్టర్ క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. రామచంద్రా మిషన్ ను ఒప్పించి కేవలం 10 శాతం ఖర్చుతో బ్రైటర్ మైండ్‌కు శ్రీకారం చుట్టారు. ఒక్కో విద్యార్థికి రూ.1300లతో మాత్రమే ఈ శిక్షణను ఇప్పిస్తున్నారు. ముందుగా దీనిని 12 పాఠశాలల్లో ప్రారంభించారు. క్రమక్రమంగా జిల్లా అంతటా విస్తరిస్తున్నారు.


ఆ తర్వాత దివ్యాంగుల సోలార్ సొసైటీని ఏర్పాటు చేశాడు. మెదక్ లో కలెక్టర్ గా పని చేసినప్పుడు కూడా దివ్యాంగుల సోలార్ సొసైటీని ఏర్పాటు చేశాడు. దీని ద్వారా దివ్యాంగులు తమ పనిని తాము చేసుకొని తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని రొనాల్డ్ రోస్ దీనిని ప్రారంభించారు. దివ్యాంగుల సోలార్ ఉత్పత్తుల కేంద్రం దినదినాభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు వారు ఉత్పత్తులు చేసిన ప్యాకెట్ లైట్స్, స్టడీ లైట్స్, ఇతర పరికరాలు మొత్తం 1940 ఉత్పత్తులు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ చేయగలిగారు.


హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనలో కూడా వీరి ఉత్పత్తులకు అద్భుత స్పందన లభించింది. జిల్లాలోని అన్ని కార్యాలయాలతోపాటు అన్ని ప్రాంతాల్లో వీరి ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. దివ్యాంగుల సోలార్ కేంద్రంలో 20 మంది దివ్యాంగులు పని చేస్తూ అందరికి స్పూర్తిగా నిలుస్తున్నారు. వారు కూడా ఆర్దికంగా నిలదొక్కుకుంటున్నారు. వారు దివ్యాంగులమన్న విషయం మరిచి మరికొంత మందికి స్పూర్తినిస్తున్నారు.


బహిరంగ మలవిసర్జనతో కలిగే అనర్థాలు, దుష్ఫరిణామాలపై జిల్లా కలెక్టర్ రోస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వం కూడా దీనికి సంపూర్ణ మద్దతునిచ్చింది. అందరూ మరుగుదొడ్లు కట్టుకునేలా కలెక్టర్ ప్రోత్సహించాడు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 566 గ్రామాల్లో ఓడీఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 75 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం 100 శాతం పూర్తి చేశారు. దీనికోసం కలెక్టర్ ప్రత్యేక నజరానాలు సైతం ప్రకటిస్తున్నారు. సంపూర్ణ స్వచ్ఛ జిల్లాగా చేసేందుకు 2020 అక్టోబర్ ను రోస్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి 14 లక్షల మొక్కలు నాటారు.


పాఠశాలల పై అందరికి బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.100 వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది దీని ఉద్దేశం. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్‌ కంపెనీలు, స్వచ్చంద సంస్థ ల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నారు.


ఓ రోజు గ్రామాల పర్యటనలో భాగంగా వెళుతున్న రోస్ కు కోయిల్‌కొండ పోతన్‌పల్లి వద్ద వద్ద కొందరు పిల్లలు మేకలను కాస్తూ కనిపించారు. ఇది చూసిన ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే వారిని. తన వాహనంలో ఎక్కించుకుని దేవరకద్ర ఉర్దూ మీడియం పాఠశాలకు తీసుకొచ్చారు. పిల్లల తండ్రి చనిపోయాడని తెలుసుకున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు 9వ తరగతి, ఇంకొకరు 3 వ తరగతిలో చదువు మానేశారని తెలుసుకొని వారిని స్కూల్ లో జాయిన్ చేయించారు. వారి బాధ్యతను అక్కడి ఉపాధ్యాయుడికి అప్పగించారు.


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లో రోస్ ఓ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో 8 మంది టీచర్లు, ఒక విద్యా వాలంటీర్ విధులకు హాజరు కాలేదు. పాఠశాల సమయం అయినా వారు రాలేదు. ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారని తెలుసుకున్న రోస్ వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించారని ఊట్కూర్ మండల పరిధిలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.


విధుల్లో అలసత్వం వహిస్తే రోస్ ఏ మాత్రం సహించడు. డ్యూటీ మైండెడ్ కలెక్టర్ గా రోస్ కు పేరుంది. ఎప్పటికప్పుడు రోస్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం చేస్తారు. హాస్టళ్లలో రాత్రి నిద్ర చేస్తారు. ఆస్పత్రులలో వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకుంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారో తెలియక అధికారులు గజగజ వణుకుతుంటారు.


నిజామాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేసినప్పుడు కూడా ఇదే దూకుడుతో వ్యవహరించారు. ఇది మింగుడు పడని కొంత మంది అధికారులు, నేతలు ఆయనను బదిలీ చేయించారని అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. రోస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రొనాల్డ్ రోస్ అందరికి "స్పూర్తి"గా నిలుస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM