శివలింగాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న జనం

byసూర్య | Tue, Feb 05, 2019, 03:01 PM

కామారెడ్డి జిల్లాలోని బొమ్మన్ దేవ్ పల్లి ఆధ్మాత్మిక శోభతో అలరారుతోంది. అల్లమాప్రభు గుట్టపై జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భారీగా తరలివస్తున్న భక్తులతో ఆ ప్రాంతం జన సంద్రాన్ని తలపిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. అల్లమాప్రభు గుట్టపై కొలువుదీరిన శివలింగాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు.


ధర్మం నశించి పాపం పెరిగిపోతున్న సమయంలో మహాపురుషులు జన్మిస్తారని చరిత్ర చెపుతోంది. ఆ కోవకు చెందిన మహోన్నత వ్యక్తే అల్లమాప్రభు మహరాజ్. అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడి… సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేసిన గొప్ప వ్యక్తి . కర్ణాటకకు చెందిన అల్లమాప్రభు… పరమశివుని భక్తుడు. చక్కటి మృదంగ విద్వాంసుడు. కమలత అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె తీవ్రమైన జ్వరంతో మరణించింది. దీంతో మానసిక వేదనకు గురైన అల్లమాప్రభు… ఆ విషాదాన్ని తట్టుకోలేక దేశ సంచారానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే అనేక శివాలయాలను దర్శిస్తుండగా… ఒకచోట అనిమిషు అనే గురువు… ఆత్మలింగాన్ని ఆయనకు ప్రసాదించారని తెలుస్తోంది. ఆ ఆత్మలింగాన్నే అల్లమాప్రభు… బొమ్మన్ దేవ్ పల్లి సమీపంలోని దట్టమైన అడవిలో కొండపై ప్రతిష్టించి పూజలు చేశారని విశ్వసిస్తారు. ఆ లింగం మహిహాన్వితమైనదని భక్తుల నమ్మకం. అందుకే భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు.


అల్లమాప్రభు గుట్టపై ప్రతి ఏటా మాఘ అమావాస్య నుంచి మూడ్రోజుల పాటు జాతర జరుగుతుంది. సమీపంలోని సింధేశ్వర మహరాజ్ గుట్టపై అగ్ని గుండాలు నిర్వహిస్తారు. చివరిరోజున నిండు జాతర, కుస్తీ పోటీలు ఉంటాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీల్లో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు పాల్గొంటారు. అల్లమాప్రభు గుట్టపై శివలింగాన్ని దర్శించుకుంటే సమస్యలు తొలగిపోయి కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్లు నడచి… అక్కడికి చేరుకుంటారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM