సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్

byసూర్య | Wed, Oct 23, 2024, 06:50 PM

మంత్రి కొండా సురేఖ చాలా అసహ్యమైన భాష వాడారని నాంపల్లి కోర్టుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. ఒక మహిళ మంత్రి అయుండి, సాటి మహిళ అయిన నటిపై అనుచిత భాష వాడారని న్యాయస్థానానికి తెలిపారు. మంత్రిపై తాను దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కేటీఆర్‌ బుధవారం (అక్టోబర్ 23) నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కోర్టుకు కేటీఆర్ తెలిపారు.


కోర్టు హాలులో జడ్జి ముందు కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? వాటి గురించి వివరాలు చెప్పగలరా అని జడ్జి ప్రశ్నించారు. కొండా సురేఖ చాలా అసహ్యమైన భాష ఉపయోగించారని, పిటిషన్‌లో ఆ వివరాలు అన్నీ ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ‘పిటిషన్‌లో ఉన్నవే తీసుకోవాలా? మీరు స్టేట్‌మెంట్ ఇస్తారా?’ అని కోర్టు ప్రశ్నించింది.


అయితే, ఒక మహిళ పట్ల తనకున్న గౌరవం నేపథ్యంలో.. కొండా సురేఖ సాటి మహిళ సమంతపై చేసిన అతినీచమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పడం తనకు ఇష్టం లేదని కోర్టుకు తెలిపిన కేటీఆర్.. కొన్ని వ్యాఖ్యలను మాత్రం చదివి వినిపించినట్లు సమచారం.


తాను డ్రగ్స్ కేసులో ఉన్నానని, కొంత మంది విడాకులు తీసుకునేందుకు తానే కారణమయ్యానని కొండా సురేఖ ఆరోపణలు చేశారని కోర్టుకు కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తనకు కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయని చెప్పారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ కుట్రపూరితంగానే తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని న్యాయస్థానానికి కేటీఆర్ తెలిపారు. తన ప్రతిష్టతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారని వివరించారు.


‘కొండా సురేఖ సాటి మహిళపై చేసిన వ్యాఖ్యల తాలూకు పూర్తి రాతపూర్వక ఫిర్యాదును మీ ముందట ఉంచాను. వాటిని నేరుగా నేను నా నోటితో చెప్పలేను’ అని కోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కేటీఆర్‌ వెంట సాక్షులుగా దాసోజు శ్రవణ్‌, సత్యవతి రాథోడ్‌, బాల్క సుమన్‌, జగదీశ్‌రెడ్డి.. నాంపల్లి న్యాయస్థానానికి వచ్చారు. కేటీఆర్‌తో పాటు దాసోజు శ్రవణ్‌ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈ నెల 30న నమోదు చేయనుంది. కేసును అక్టోబర్ 30కి వాయిదా వేసింది.


కొండా సురేఖ రిప్లై..


మరోవైపు.. మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ కోర్టులో నేడు విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ గుర్మీత్‌ సింగ్‌ రిప్లైని ఫైల్‌ చేశారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు అక్టోబర్‌ 30కి వాయిదా వేసింది.


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM