కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా.. 'వాళ్లందరికీ ఇదొక గుణపాఠం

byసూర్య | Tue, Oct 22, 2024, 06:53 PM

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు తీవ్ర వివాదాలకు తెరతీస్తున్నాయి. అవి కాస్త కోర్టులకు చేరుతున్నాయి. అందులో ప్రత్యేకంగా.. మంత్రి కొండా సురేఖ చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారానికి తెరలేపాయి. అయితే.. కొండా సురేఖ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ, కేటీఆర్ కోర్టును ఆశ్రయించటమే కాకుండా.. ఆమెపై పరువు నష్టం దావాలు వేశారు. కొండా సురేఖపై 100 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై మరోసారి స్పందించిన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


తన క్యారెక్టర్ మీద చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు తాను కీలక నిర్ణయానికి వచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన దురుద్దేశపూర్వకమైన, చౌకబారు వ్యాఖ్యలపైన తాను 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలపైన న్యాయపోరాటం చేస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా.. తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు అడ్డు అదుపు లేకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు.. తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపిన కేటీఆర్.. కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను వేసిన ఈ పిటిషన్.. చౌకబారు వ్యాఖ్యలు చేసే వారికి ఓ గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ ఆకాంక్షించారు.


ఒక ప్రజా ప్రతినిధిగా తాను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని.. ఇకపై ఇస్తానని చెప్పుకొచ్చిన కేటీఆర్.. ప్రస్తుతం తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వచ్చిందని, ఒక గీత గీయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వాక్చాతుర్యాన్ని ప్రదర్శించే వాళ్లకు ఇది ఒక గుణపాఠం అవుతుందని తాను భావిస్తున్నట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.


ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఈ నెల 23కు న్యాయస్థానం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆ‌ర్‌తో పాటు సాక్షులుగా బీఆర్‌ఎస్‌ నేతలు తుల ఉమ, బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, దాసోజు శ్రవణ్‌ కుమార్‌ సాక్షాలను సైతం కోర్టు నమోదు చేయనుంది. కాగా.. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సంజాయిషీ చెప్పుకునేందుకు మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 23న) రోజునే కోర్టుకు హాజరుకానున్నారు. ఇక అదేరోజు ఆమె కేటీఆర్‌ పిటిషన్‌పై కూడా సంజాయిషీ ఇచ్చే అవకాశం ఉంది.


Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM