ఇక చూస్తూ ఊరుకునేది లేదు.. రేవంత్ సర్కార్‌‌పై తీన్మార్ మల్లన్న పోరాటం

byసూర్య | Mon, Oct 21, 2024, 07:16 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ ప్రాజెక్టు రాజకీయ ప్రకంపనలు రేపుతున్న క్రమంలోనే.. ఇప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నేపథ్యంలో జీవో నెంబర్ 29 రద్దు చేయాలంటూ చెలరేగిన వివాదం తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామాలకు దారి తీస్తోంది. నిన్నటివరకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీలే వ్యతిరేక గళం వినిపించగా.. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా దిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే వ్యతిరేక కామెంట్లు చేస్తున్న తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేయటం సర్వత్రా చర్చనీయాశంగా మారింది.


సోమవారం (అక్టోబర్ 21న) రోజున రాజ్ భవన్‌లో బీసీ సంఘం ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని పార్టీల్లోని బీసీ సంఘాల నాయకులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి.. జోవో 29 విషయంలో ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. జీవో 29 వద్దని చెబుతున్నా అదే జీవో ప్రకారం ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని మండిపడ్డారు. తన అంచనా ప్రకారం గ్రూప్ -1 పరీక్షలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. అటూ ఇటు తిరిగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోందంటూ అభిప్రాయపడ్డారు.


తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తీన్మార్ మల్లన్న తెలిపారు. గతంలోనే ఈ సమస్యను గవర్నర్‌కు వివరించినట్టు తెలిపిన మల్లన్న.. ఈరోజు మరోసారి కలిసి గవర్నర్‌కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.


పదే పదే పరీక్షలు వాయిదా పడటం వల్ల అభ్యర్థుల మనోధైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు తీన్మార్ మల్లన్న.. కోర్టు కేసుల పరిష్కారం తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాల ప్రజల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మల్లన్న పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డికి 3 సార్లు, గవర్నర్‌కు 2 సార్లు వినతిపత్రం అందజేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగకుండా.. అవకాశం ఉన్న ప్రతిచోటా రిప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు.


ఇప్పటికే బీసీలమంతా ఏకమయ్యామని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. తమ ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా మొండిగా ముందుకు వెళ్తామంటే అది రాజకీయ సమాధికి నాంది పలుకుకుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన నాయకుడు రాహుల్ గాంధీ ఆశయాలను తెలంగాణలో నెరవేర్చబోతున్నామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేసినా.. లేక ప్రభుత్వంలోని ఎవరూ అలా చేసినా.. తామంతా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాహుల్ గాంధీ తలదించుకునే పనులు ఎవరు చేసినా అంగీకరించబోమని చెప్పుకొచ్చారు.


ఓవైపు రాహుల్ గాంధీనే జనాభా దామాషా రిజర్వేషన్లు ఉండాలని చెబుతుంటే ఇక్కడ అలా జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమన్నారు. గవర్నర్ చర్యలు తీసుకుంటామని నమ్ముతున్నట్టు తీన్మార్ మల్లన్న ఆకాంక్షించారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM