వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

byసూర్య | Sat, Oct 19, 2024, 10:30 PM

ఏపీలో జనసేన పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది. వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత కుమార్తె.. జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె ముద్రగడ క్రాంతి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రాజమండ్రికి చెందిన ముద్రగడ క్రాంతి దంపతులతో పాటుగా, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు, జగ్గయ్యపేట మున్సిపల్‌ కౌన్సిలర్లు నలుగురు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు.


వాస్తవానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ముద్రగడ క్రాంతి జనసేనలో చేరేందుకు ఆసక్తిని చూపించారు. అయితే తన కుటుంబాన్ని విడదీసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. విలేకర్ల సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. దీంతో ముద్రగడ కుటుంబాన్ని విడదీయడం ఇష్టం లేదంటూ పవన్ కళ్యాణ్.. అప్పట్లో ముద్రగడ క్రాంతిని జనసేనలోకి ఆహ్వానించలేదు. అయితే భవిష్యత్తులో ఆమెను జనసేనలో చేర్చుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో ముద్రగడ క్రాంతిని జనసేనలోకి చేర్చుకున్నారు.


మరోవైపు చేరికల కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు, జనసేనలో చేరికలు విశ్వాసాన్ని మరింత పెంచాయని అన్నారు. సామినేని ఉదయభాను మంచి వ్యక్తి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. అతనిపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇక పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయన్న పవన్ కళ్యాణ్.. అవినీతి అనే మాటలేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. బదిలీలలోనూ లంచం అనే మాటల లేకుండా పనిచేశామన్న పవన్ కళ్యాణ్..లంచం అనే పదం వినిపిస్తే కార్యాలయం నుంచి వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM