ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు

byసూర్య | Sat, Oct 19, 2024, 09:31 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తుండగా.. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారొచ్చునని చెప్పారు.


దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అన్నారు. నేడు నిర్మల్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.


హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఉదయం కాస్త ఎండగా ఉంటుందని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని చెప్పారు. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM