డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు

byసూర్య | Sat, Oct 19, 2024, 07:40 PM

ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయనే సామెత వినే ఉంటారు. అ సామెతకు సరైన నిర్వచనం ఇదే కావొచ్చు. కారు డ్రైవింగ్‌ నేర్చుకుందామని పోతే కాటికి పోయేంత పనయింది. చావును దగ్గర్నుంచి చూడాల్సి వచ్చింది. జనగామ జిల్లా కేంద్రంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనుకోని ఘటనతో అక్కడున్నోళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట మైదానంలో ఓ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తితో కారు డ్రైవింగ్ చేయటం నేర్చుకుంటున్నాడు.


అయితే కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే కొత్త కార్లలో పికప్ చాలా ఎక్కువగా ఉంటుందనేది. ఈ విషయాన్ని డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి సైతం.. కారు నేర్చుకుంటున్న తన ఫ్రెండ్‌కు చెప్పలేదు. దీంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి కారు పికప్‌ను సరిగా అంచనా వేయలేకపోయాడు. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే.. కంగారులో కారు బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ని తొక్కాడు. దీంతో కారు సర్రున పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. బతుకమ్మ కుంటలో నీరు ఎక్కువగా ఉండటంతో కారు సగానికిపై పైగా మునిగిపోయింది.


గమనించిన ఓ యువకుడు వారిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. కారు నీటిలో సగం వరకు మునిగిపోవటంతో డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో చావు తప్పదని వారు భావించారు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా తలుపులు ఓపెన్‌ కాలేదు. ఒడ్డున ఉన్న స్థానికుల సూచన మేరకు డ్రైవర్ పక్కనే ఉన్న వ్యక్తి డోర్ అద్దాన్ని కిందకు దించి అందులో నుంచి ఒకరు తర్వాత ఒకరుగా నీళ్లలోకి దూకారు. ఇద్దరికీ ఈత రావటంతో ఈదుకుంటూ బయటకు వచ్చారు.


మొత్తానికి ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెరువు ఒడ్డునే కొందరు మహిళలు పిల్లలతో సహా వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నారు. వారికి సమీపం నుంచే చాలా వేగంగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. కొంచెమయితే వారి పై నుంచి కారు వెళ్లేది. ఈ ఘటనలో ఒడ్డున ఉన్న వారికి కూడా ఏమీ కాకపోవటంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM