తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు.. ఫీల్డ్‌లోకి సీవీ ఆనంద్‌

byసూర్య | Sat, Sep 07, 2024, 08:00 PM

 వినాయక చవితి పండుగ వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలువురు కీలక పదవుల్లో ఉన్న ఐపీఎస్‌లను బదీలు చేస్తూ.. శనివారం (సెప్టెంబర్ 07న) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సీనియర్ ఐపీఎస్‎లకు స్థాన చలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం విజిలెన్స్ డీజీగా బదిలీ చేయగా.. ఏసీబీ డీజీగా విజయ్‌ కుమార్‌‌ను నియమించింది. ఇదిలా ఉండగా.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో.. హైదరాబాద్ కొత్త సీపీగా మరోసారి సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరోవైపు.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.


ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్‌ను.. మరోసారి హైదరాబాద్ కమిషనర్‌గా నియమించటం.. ఆ స్థానంలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేయటంపై సర్వత్రా చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌.. హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమలు చేసిన విషయం తెలిసిందే. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలోనూ సీవీ ఆనంద్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంచలన కేసులను త్వరితగతిన ఛేదించి.. నిందితులను పట్టుకున్నారు.


కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీవీ ఆనంద్‌ను ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. ఏసీబీ డీజీగా కూడా సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతి చేపలు, తిమింగలాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వణికించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిపరులు చాలా మంది ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా సీవీ ఆనంద్ చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరోసారి సీవీ ఆనంద్‌ను హైదరాబాద్ సీపీగా తీసుకురావటంతో.. మళ్లీ నగరంలో పాత రోజులు రానున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.


అయితే.. ఇప్పటికే హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆధేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు.. పోలీసులు, నార్కోటిక్ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. ఏ చిన్న క్లూ దొరికినా చొచ్చుకుపోయి పెద్ద పెద్ద డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. మరోవైపు.. గంజాయి బ్యాచ్‌లను కూడా కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నగరంలో శాంతి భద్రతల విషయంలో మంచి అనుభవం ఉన్న సీవీ ఆనంద్‌ను.. సరిగ్గా వినాయక చవితి సమయంలో తీసుకురావటం కూడా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి.. మరోసారి ఫీల్డ్‌లోకి వచ్చిన సీవీ ఆనంద్.. ఎలాంటి పోలీసింగ్ చేయనున్నారో..?


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM