పెద్ద టాస్క్ ఆ ఎన్నికలే.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

byసూర్య | Sat, Sep 07, 2024, 07:37 PM

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. తొలిసారి స్పందించారు. ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంతో పాటు.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న అదిపెద్ద టాస్క్ అని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. తన నియామకానికి సహకరించిన అధిష్ఠానానికి.. పార్టీ నేతలందరికి మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. కష్టపడిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.. అందుకు తన నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు.


టీపీసీసీ పదవి కోసం పార్టీలోని చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారని.. వాళ్లందరూ ఆ పదవికి అర్హులేనని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే.. కొన్ని సమీకరణాల నేపథ్యంలో అధిష్ఠానం తనకు అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.


తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి.. మహేశ్‌ కుమార్ గౌడ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీపీసీసీగా తన నియామకానికి సహకరించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం 1983లో ప్రారంభమైందని పేర్కొన్నారు. అయితే.. తాను ఈ స్థాయికి వస్తానని ఊహించలేదని చెప్పుకొచ్చారు. ఎన్‌ఎస్‌యూఐలో పనిచేయడం బాగా కలిసొచ్చిందని మహేష్ తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయటమే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా తన ప్రయత్నం చేస్తానన్నారు.


మరోవైపు టీపీసీసీ పదవి కోసం పోటీ పడిన సీనియర్ నేతలను కలుపుకుని పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని కష్టపడుతున్న కార్యకర్తలకు.. సముచిత స్థానం దక్కేలా తనవంతు కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లోనే టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపారు.


ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉంటూ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలోనే కమిటీలను కూడా నియమిస్తామని చెప్పుకొచ్చారు. పార్టీ పదవులను కూడా భర్తీ చేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM