రికార్డ్ బ్రేక్ చేసిన టీజీఎస్ ఆర్టీసీ.. ఏకంగా 54 కోట్ల జీరో టికెట్లు.. రోజుకు ఎంత మంది అంటే

byసూర్య | Mon, Jun 24, 2024, 09:19 PM

టీజీఎస్ ఆర్టీసీ గత రికార్డులన్ని బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు చేరినట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అయితే.. ఈ 20 లక్షల ప్రయాణికుల్లో 70 శాతం మంది అంటే 14 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయగా.. ఊహించని రీతిలో స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కాదు.. కొన్ని బస్సుల్లో ఏకంగా 120 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉంటోంది. ఆ ఆక్యుపెన్సీలో 70 శాతం వరకు మహిళలే ఉండటం గమనార్హం.


డిసెంబర్ 9న ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మహిళామణులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారు చేసే ప్రయాణాలకు కారణం ఏదైనా.. దానికి ఆర్టీసీ బస్సునే ఎంచుకుంటుండటమే.. ఈ రికార్డు సాధించడానికి ప్రధాన కారణం. పథకం ప్రారంభించిన తొలిరోజుల్లో.. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 16 లక్షలు ఉండగా.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఆ సంఖ్య ఇప్పుడు 20 లక్షలకు చేరింది.


ఇదిలా ఉంటే.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు సుమారు 54 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను విరివిగా వినియోగించుకోవటమే కాకుండా.. ప్రయాణికులకు ఆర్థికంగా వెసలుబాటు కూడా లభిస్తోందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.


 ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల రికార్డుల మాట పక్కన పెడితే.. దీని వల్ల ఎన్ని అనర్థాలు చూడాలో అన్నీ చూడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. గతంలో నీటి కటకట తీవ్రంగా ఉన్న సమయంలో.. కేవలం ట్యాంకర్ల దగ్గరో, నీటి కుళాయి దగ్గర మాత్రమే సిగపట్లు పట్టుకోవటం కనిపించేది. ఈ ఉచిత బస్సు పథకం పుణ్యమా అని.. సీట్ల కోసం బస్సుల్లో మహిళామణులు సిగపట్లేం కర్మా.. చెప్పులతో కూడా కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. వాళ్లు వాళ్లు కొట్టుకోవటమే కాదు.. ఆర్టీసీ సిబ్బందిని కూడా బూతులు తిట్టటం, కొందరైతే మీద పడి కొట్టటం లాంటి సందర్భాలు కూడా జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే.. సంస్థకు మాత్రం రికార్డులు తెచ్చిపెడుతోంది ఈ పథకం.


Latest News
 

తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM
నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM