కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీకి రిజైన్ చేసి..!

byసూర్య | Mon, Jun 24, 2024, 07:57 PM

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే.. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో (జూన్ 22న) చేరగా.. ఆ వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా (జూన్ 23న) హస్తం గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్‌ఎల్పీ విలీనమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా వార్తలు వస్తుండగా.. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ఈ పనిపై ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.


పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపైన మీడియా ముఖంగానే జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సరిపోయినంత మెజార్టీ ఉందని.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన జీవన్ రెడ్డి.. ఇలాంటి పనులను తాను ప్రోత్సహించనని చెప్పుకొచ్చారు. పోచారం చేరిక పూర్తిగా అవకాశవాదానికి నిదర్శనంగా అభివర్ణించారు. జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే.. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం గమనార్హం.


తన సొంత నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవటంపై కనీస సమాచారం కూడా లేకపోవటంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. తనను రెండుసార్లు ఓడించిన తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవటం కూడా తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని కూడా తెలుస్తోంది. దీంతో.. తీవ్ర ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. బుజ్జగింపులు జరుగుతుండగా.. తన భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో జీవన్ రెడ్డి చర్చించారు.


జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ఆయనకు నచ్చజప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా.. 40 ఏళ్లుగా రాజకీయం చేశానని.. ఇక చాలని జీవన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. పార్టీకి రాజీనామా చేసి.. వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో... ఆయన ఏం నిర్ణయం తీసుకోనున్నారన్నది ఉత్కంఠగా మారింది.


కాగా.. జీవన్ రెడ్డి రెండుసార్లు సంజయ్ చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి గెలిస్తే.. కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇప్పిస్తానంటూ చెప్పటం గమనార్హం. ఇదిలా ఉంటే.. 70 ఏళ్లు దాటిన జీవన్ రెడ్డి.. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పదే పదే చెప్తూ వచ్చారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM