బస్టాండ్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. జీవితాంతం ఫ్రీ జర్నీ

byసూర్య | Wed, Jun 19, 2024, 08:43 PM

ఇటీవల కరీంనగర్ బస్టాండ్‌లో ఓ గర్భిణీకి ప్రసవం జరిగిన సంగతి తెలిసిందే. బస్టాండ్‌లో ఉన్న ఆ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో.. ఆర్టీసీ సిబ్బంది, తోటి ప్రయాణికుల సాయంతో బస్టాండ్‌లోనే పురుడు పోశారు. ఆ మహిళకు ఆడబిడ్డ పుట్టింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ఈ సంఘటనపై స్పందించిన టీజీఎస్ ఆర్టీసీ.. ఆ చిన్నారికి జీవిత కాలం తెలంగాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్‌పాస్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలం ఉచిత బస్‌పాస్‌ను ఇవ్వాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


ఈ నెల 16 వ తేదీన కరీంనగర్ బస్ స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే ఈ నెల 16 వ తేదీన కూమారి అనే నిండు గర్భిణీ.. తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ బస్టాండ్‌లోని ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం అందించారు. ఆ లోగానే నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది రంగంలోకి దిగారు. చీరలను అడ్డుపెట్టి కుమారికి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల జన్మించింది.


వెంటనే అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వతా తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కరీంనగర్ బస్ స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటుకున్నన ఆర్టీసీ సిబ్బంది పట్ల అక్కడ ఉన్న ప్రయాణికులే కాకుండా సోషల్ మీడియాలోని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో మహిళకు ప్రసవం చేసిన టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్‌లో ఆ సంస్థ బుధవారం అభినందించింది.


ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహారించిన వారిని పొగిడారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారిని ఆపద సమయంలో భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని తెలిపారు. బస్ స్టేషన్‌లో పుట్టిన ఆ చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM