byసూర్య | Mon, May 20, 2024, 08:50 PM
రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. తెలంగాణ పట్టణ రాష్ట్రంగా మారుతుందని చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (CII), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన మూడు రోజుల గ్రీన్ ప్రాపర్టీ షో ఆదివారం (మే 19) సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు.
అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని అన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర కరెంట్ సప్లయ్, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా నగరం వరల్డ్ క్లాస్ సిటీగా ఎదుగుతోందని అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కొంచెం ఆలస్యమైందని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రీన్, నెట్ జీరో కాన్సెప్ట్‌లకు సీఐఐ-ఐజీబీసీ సహకారం అందించాలని ఈ సందర్భంగా భట్టి కోరారు. పర్యావరణాన్ని కాపాడేలా హరిత భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఐజీబీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలకుల దూర దృష్టి కారణంగానే హైదరాబాద్ నగరంలో ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కృష్ణా జలాలు, మెట్రో ట్రైన్‌లకు శంకుస్థాపన వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందనున్న ఆర్‌ఆర్‌ఆర్ సూపర్ గేమ్‌ఛేంజర్ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మూడు, నాలుగు నెలల్లో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా తమది వన్ మ్యాన్‌షో కాదని ఎద్దేవా చేశారు. సమష్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు.