వరంగల్‌లో నా యంగ్ ఫ్రెండ్‌ని కలిశాను.. క్యూటెస్ట్ ఫొటో షేర్ చేసిన నరేంద్ర మోదీ

byసూర్య | Wed, May 08, 2024, 07:32 PM

లోక్ సభ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకోగా.. తెలంగాణలో ప్రచారంలో రాజకీయ పార్టీలు జోరు పెంచారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. తాజాగా.. కరీంనగర్, వరంగల్‌లో పర్యటించిన నరేంద్ర మోదీ బిజీ బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనగా.. మార్గ మధ్యలో ఓ చిన్నారిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పిల్లాడిని ఆడిస్తూ.. మోదీ కూడా ఓ పిల్లాడైపోయారు. అందుకు సంబంధించిన ఫొటోను స్వయంగా మోదీనే ఆ పిల్లాడిని ఎత్తుకున్న క్యూటెస్ట్ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.


కాగా.. ఆ ఫొటోకు "వరంగల్‌లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను" అంటూ తెలుగులో రాయటంతో పాటు స్మైలీ ఎమోజీని కూడా జోడించారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు " మోదీజీ మీ క్యూట్ ఫ్రెండ్ బాగున్నాడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న కూడా అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న సమయంలో.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని సరదాగా ఆడించారు మోదీ. అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.


ఇదిలా ఉంటే.. అంతకు ముందు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దివ్యక్షేత్రాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కును కూడా చెల్లించుకున్నారు. ఆలయమంతా కలియతిరిగి.. పరిశీలించారు. అనంతరం.. వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలది అవినీతిలో ఫెవికాల్ బంధమంటూ మోదీ దుయ్యబట్టారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ.. తెరవెనుక మాత్రం సిండికేట్‌గా మారుతారంటూ తీవ్ర విమర్శలు చేశారు.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించిందని... కానీ అధికారంలోకి వచ్చాక దానిపై ఎలాంటి దర్యాప్తు చేయట్లేదంటూ మోదీ మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్ మీదే సర్వత్రా చర్చ జరుగుతోందన్నారు మోదీ. ఆర్ ఆర్ ట్యాక్స్‌ ద్వారా వచ్చే వసూళ్లు..ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన వసూళ్లను మించిపోయాయన్నారు. తెలంగాణలోని ఆర్‌ లూటీ చేసి.. ఢిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారంటూ మోదీ చెప్పుకొచ్చారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM