వరంగల్‌లో రూ. 5 కోట్ల మోసం.. తెరపైకి దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ పేర్లు

byసూర్య | Sat, May 04, 2024, 07:42 PM

వరంగల్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారిని మోసం చేసి కొందరు దుండగులు రూ. 5 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాతా డబ్బులడిగితే ఇంటర్నేషన్ డాన్స్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. వారిద్దరూ తమకు తెలుసునని డబ్బులిడితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ బ్యాంకు కాలనీకి చెందిన పూర్ణచందర్‌రావుకు స్థానికంగా భాగ్యలక్ష్మి కాటన్‌ ఇండస్ట్రీస్‌ పరిశ్రమ ఉంది. ఇందులో ఎం.శ్రీధర్‌ అనే వ్యక్తి గుమాస్తాగా పనిచేస్తుండగా.. జూన్‌ 2022లో తన యజమానికి వరంగల్‌ నల్లబెల్లికి చెందిన యు.విష్ణు అనే వ్యక్తిని పరిచయం చేశాడు. తన కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే 1.5 శాతం ఎక్కువ నగదును ఆర్‌టీజీఎస్‌ ద్వారా చెల్లిస్తారని విష్ణు పూర్ణచందర్ రావును నమ్మించాడు. వ్యాపారికి సంబంధించిన పాన్‌, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకున్నారు.


వీటిని గుర్తు తెలియని పలువురికి పంపించారు. ఈ క్రమంలో వ్యాపారి పూర్ణచందర్‌రావుకి నాయుడు అనే మరో వ్యక్తి వాట్సప్‌ కాల్‌ చేసి రూ.5 కోట్లు హవాలా మార్గంలో పెట్టుబడి పెడితే వెంటనే రూ.15 కోట్లు చెల్లిస్తామని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన వ్యాపారి.. రూ. 5 కోట్ల డబ్బును తీసుకెళ్లి హైదరాబాద్‌ కవాడిగూడలో ఉండే శివం మోడీ అనే వ్యక్తికి అప్పగించాడు. రూ.15 కోట్లు తన ఖాతాలో వెంటనే జమ కాకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. ఆ తర్వాత వారిని నిలదీయగా.. రూ.1.27 కోట్లు తిరిగి పూర్ణచందర్‌రావుకు అప్పగించాడు. మిగిలిన నగదు రూ.3.73 కోట్లు ఎప్పుడు ఇస్తారని బాధితుడు ముఠా సభ్యుడైన శ్రీకాంత్‌ను అడగడంతో త్వరలో మిగతా నగదు ఇస్తానని చెబుతూ వచ్చాడు.


రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోటవంతో శ్రీకాంత్‌ను పూర్ణచందర్‌ రావు నిలదీశాడు. దీంతో 'నాకు దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌లు తెలుసు. మరోసారి కాల్‌ చేస్తే చంపేస్తా' అంటూ శ్రీకాంత్ అతడిని బెదిరించాడు. చేసేదేం లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM