మా రక్తంలో అణువణువునా హిందుత్వం ఉంది.. బండ్ల గణేష్

byసూర్య | Thu, May 02, 2024, 07:07 PM

 తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవటంతో పాటు ఇప్పుడు రిజర్వేషన్లు, మతాల ప్రస్తావనలు కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బండ్ల గణేష్.. హిందుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.


తాము బతికేదే శ్రీరామున్ని, హనుమంతున్ని నమ్ముకుని అంటూ తెలిపిన బండ్ల గణేష్.. హనుమాన్ చాలీసా చదివారు. బీజేపీ వాళ్లు కేవలం తాము హిందువులమని చెప్పుకుంటున్నారని.. కానీ తమ రక్తంలో అణువణువూ హిందుత్వమే ఉందంటూ బండ్ల గణేష్ తెలిపారు. ఆంజనేయునికి, అయ్యప్పను, వెంకటేశ్వర స్వామిని ఇలా అందరూ దేవుళ్లను మొక్కుతామని.. ముస్లిం సోదరులొస్తే నమస్కరిస్తామని.. క్రిస్టియన్లు వస్తే గౌరవిస్తామంటూ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని.. తమ కంటే హిందువులు ఎవరూలేరని.. కాంగ్రెస్ పార్టీనే హిందూ పార్టీ అని చెప్పుకొచ్చారు.


రాహుల్ గాంధీ ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డారని వివరించారు. బుడి బుడి అడుగులు వేస్తూ తన నానమ్మ దగ్గరికి వెళ్తుంటే టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపేశారని.. ఆ తర్వాత తన తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశారని.. అయినా వెనకడుగు వేయకుండా దేశం కోసం నిలబడ్డారంటూ బండ్ల గణేష్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. ప్రపంచంలో భారతదేశం పటాన్ని గీసింది కాంగ్రెస్ పార్టీ అని.. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం గర్వం, నిజాయితీ అని.. నిర్భయంగా తాను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటానన్నారు. తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనేనని.. చనిపోయేది కూడా కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలోనే.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురించి కూడా పొగిడారు. ఓర్పు సహనం, మంచితనం, తన మీద తనకు నమ్మకం, నిబద్ధత, నిజాయితీ.. ఎదుటివారి పట్ల గౌరం ఇలా ఎన్నో గుణాలున్న శ్రీధర్ బాబు.. ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదుగుతారంటూ ఆకాశానికెచ్చేశారు. ఇక.. కాకా గురించి కూడా ప్రస్తావించిన బండ్ల గణేష్.. ఆయనను కూడా కొనియాడారు. ఆయన ఎక్కడున్న తన మనవడు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నాడని తెలిసి ఉప్పొంగిపోతాడంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. గడ్డం వంశీకృష్ణకు కనీసం లక్ష మెజార్టీ ఇచ్చి గెలిపించాలని బండ్ల గణేష్ సూచించారు.


Latest News
 

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే Fri, May 17, 2024, 03:32 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 03:31 PM
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు Fri, May 17, 2024, 03:30 PM
వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 02:55 PM
మహబూబాబాద్ లో అశోక్ ప్రచారం.. భారీ స్పందన Fri, May 17, 2024, 02:50 PM