కాంగ్రెస్‌కు షాకిచ్చిన సిట్టింగ్ ఎంపీ.. బీజేపీలో చేరిక.. 2 నెలల్లోనే మూడో కండువా

byసూర్య | Mon, Apr 29, 2024, 07:30 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా.. ఇప్పటికీ జంపింగ్ జపాంగుల పర్వం కొనసాగుతోంది. కాగా.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పార్టీ ఫిరాయింపులు మొదలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఎక్కువ మంది చేరిపోయారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా నిరాశే ఎదురవటంతో.. వెంకటేశ్ నేత బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు వెంకటేశ్ నేత. దీంతో.. రెండు నెలల్లోనే రెండు కండువాలు మార్చి ఇప్పుడు మూడో కండువా కప్పుకున్నట్టయింది.


అయితే.. పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేత కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించగా.. ఆయనకు మొండి చేయి చూపించి.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో.. వెంకటేష్ నేత బీజేపీలో చేరారు. కాగా.. బీజేపీ నుంచి కూడా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు కూడా. మరి ఈ సమయంలో బీజేపీలో చేరటం వెనుక వెంకటేశ్ నేత వ్యూహం ఏంటీ అన్నది తెలియాల్సి ఉంది.


అయితే.. ఫిబ్రవరి 6వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత.. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. కాగా.. బోర్లకుంట వెంకటేశ్‌ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత.. 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన వెంకటేశ్ నేత.. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM