రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నాడు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Mon, Apr 29, 2024, 07:26 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అంశం. ఏపీసీసీ చీఫ్‍‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడమే ఓ సంచలనమైతే.. ఆ తర్వాత రాజకీయంగా ఆమె వేసిన ప్రతీ అడుగు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా సాగిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. వైఎస్ జగన్ మీద, వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.


అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద, వైఎస్ జగన్ మీద విమర్శలు చేశారు షర్మిల. వైసీపీ విధానాలను ఎండగడుతూ.. మీరా వైఎస్ఆర్ రాజకీయ వారసులు అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హత్యకేసులో నిందితులను చట్టసభలను వెళ్లనీయనంటూ.. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా.. తమ్ముడు వైఎస్ అవినాష్ మీదే పోటీకి దిగారు.


మరోవైపు కడప ఎంపీ సీటుకు వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటంపై వైఎస్ జగన్ తొలిసారిగా నోరు విప్పారు. షర్మిల ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ వచ్చిన వైఎస్ జగన్.. పచ్చచీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లారంటూ ఇటీవల కాస్త ఘాటుగానే కౌంటర్లు వేశారు. తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కడపలో వైఎస్ షర్మిల పోటీపైనా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే షర్మిల తనపై యుద్దానికి వస్తోందని జగన్ అన్నారు. కడపలో షర్మిల డిపాజిట్లు పోగొట్టుకుంటుందనే బాధ తనను కలిచివేస్తోందని చెప్పుకొచ్చారు.


ఈ ఎన్నికల్లో మీ చెల్లెలు షర్మిలే మీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరుఫున పోరాడుతున్నారు. ఇది మీకు సమస్యగా అనిపించడం లేదా అని జర్నలిస్టు ప్రశ్నించగా.. " కడపలో తనకు( షర్మిల) డిపాజిట్లు కూడా పోతాయనిపిస్తోంది. అదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. ఆమె చేస్తోంది కరెక్ట్ కాదు. ఏ పార్టీలో ఆమె ఉందో అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరు ఛార్జిషీట్లో పెట్టింది. అక్రమ కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, టీడీపీనే. ఇప్పుడు చంద్రబాబు నాయుుడు రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలను, ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, బీజేపీని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తోంది చంద్రబాబే" అంటూ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోండగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి మరి. జగన్ ప్రతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న వైఎస్ షర్మిల ఇప్పుడెలా స్పందిస్తారనేదీ చూడాలి.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM