నీటి సంపు మూత ఓపెన్ చేసిపెట్టిన ఓనర్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, క్షణాల్లో ఎంత ఘోరం

byసూర్య | Mon, Apr 22, 2024, 07:35 PM

హైదరాబాద్‌ కొండాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిమ్ చేసి ఇంటికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్ అనే యువకుడు.. హైదరాబాద్‌లోని కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే.. అక్మల్‌కు రోజూ ఉదయం జిమ్ చేసే అలవాటు. రోజూలాగే.. ఆదివారం కూడా అక్మల్ జిమ్ చేసి తిరిగి హాస్టల్‌కు తిరిగి వస్తున్నాడు. అక్మల్ గేట్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో.. ఒక చేతిలో కవర్, మరో చేతిలో ఫోన్ ఉండటంతో.. కిందికి గమనించకుండా ముందుకు నడిచాడు. అయితే.. గేటు తర్వాత నడిచే మార్గంలోనే నీటి సంపు ఉండటం.. అది తెరిచి ఉండగా.. అది చూసుకోకుండా పరధ్యానంగా ముందుకు నడవటంతో ఒక్కసారిగా సంపులో పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయం కావటంతో.. అక్కడిక్కడే మృతి చెందాడు.


 ఆలస్యంగా గమనించిన హాస్టల్ యజమాని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అక్మల్ మృతదేహాన్ని సంపు నుంచి బయటకు తీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


అయితే.. ఈ ఘటనలో యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. అక్కడే ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా.. చూసుకోకుండా ముందుకు నడుస్తుండటంతో.. అప్పటికే తెరిచి ఉన్న సంపులో పడిపోయినట్టుగా రికార్డయ్యింది. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే.. అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని తెలుస్తోంది. కాగా.. సంపు తెరిచి ఉన్నట్టుగా అక్కడ ఎలాంటి సైన్ బోర్డు కూడా లేకపోవటంతోనే.. ఎప్పటిలాగే అక్మల్ నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. కాగా.. మొత్తంగా యజమాని నిర్లక్ష్యం వల్లే.. అక్మల్ మృతి చెందినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.


అయితే.. హైదరాబాద్ నగరంలోని చాలా భవనాల్లో.. గేటు తర్వాత నడిచే మార్గంలోనే సంపు మూతలు ఉండటం గమనార్హం. నల్లాలు వచ్చే సమయంలోనో.. బోర్లు వేసినప్పుడో.. సంపును క్లిన్ చేసే సందర్భంలోనో.. ఇలా మూతలు తెరిచిపెడుతుంటారు. అయితే.. మూతలు తెరిచిన సమయంలో ఎలాంటి సైన్ బోర్డులు పెట్టకపోవటం వల్ల.. ఇలాంటి షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఓనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమే కాకుండా.. నడిచే సమయంలో పరధ్యానంగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన చెప్తోంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM