బాంచన్ మీ కాళ్లు మొక్కుతా సారూ.. గుండెల్ని మెలిపెడుతున్న మహిళా రైతు ఆవేదన

byసూర్య | Mon, Apr 22, 2024, 07:32 PM

ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్టనష్టాలకొర్చి పంట పండిస్తే.. చేతికొచ్చిన ధాన్యం కాస్త కల్లాల్లో పోసిన తర్వాత వర్షార్పణం అయితే.. ఆ రైతు గుండె ఎంత వేదన అనుభవిస్తుందో మాటల్లో చెప్పటం కష్టం. చేతిలో ఉన్న రూపాయికి అప్పోసప్పో చేసి ఇంకో రూపాయి జత చేసి.. విత్తనాలు, ఎరువులు కొని పంట వేస్తే.. నమ్ముకున్న వరుణుడు చుట్టపు చూపుగా వచ్చినా.. కాలువలున్నాయని దీమాగా ఉంటే.. అవి కూడా ఎండిపోయి మొండి చేయి చూపిస్తే.. ట్యాంకర్లు తెప్పించి మరీ పంటను కాపాడుకున్నారు అన్నదాతలు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఇంకెన్ని ఒడిదుడుకులు ఎదురైనా కంటికి రెప్పలా పంటను కాపాడుకుని.. చివరికి కల్లాల్లోకి తీసుకొస్తే.. ఎన్ని రోజులైనా కొనకపోవటంతో ధాన్యపు రాశులకు ఎండల్లో కాపలా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు.


పంటకు కావాల్సినప్పుడు ముఖం చాటేసిన వరుణుడు.. పంట కోతకు వచ్చే సమయంలోనో, ధాన్యం కల్లాల్లోకి వచ్చిన తర్వాతో పనిగట్టుకుని మరీ విరుచుకుపడుతూ.. ఆరుగాలం పడి కష్టాన్ని నేలపాలు చేస్తూ.. అన్నదాతల గుండెలను చెరువులు చేస్తుండటం బాధాకరం. అచ్చం అలాంటి దయనీయమైన సన్నివేశాలే కనిపిస్తున్న తెలంగాణలోనూ. రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కోతలు అయిపోయి.. ధాన్యాన్ని కల్లాల్లోకి తరలించారు రైతులు. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో పంటలు కోతలకు రాగా.. చాలా వరకు ధాన్యం కల్లాల్లో ఉంది. సుమారు 15 రోజులుగా ఎప్పుడెప్పుడూ అధికారులు వడ్లు కొంటారా అని కళ్లల్లో వత్తులేసుకుని మరీ రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు.


రాష్ట్రంలో ఎన్నికల హడావుడి జోరుగా నడుస్తుండటంతో.. రైతులను పట్టించుకునే నాథుడు కరువవటంతో.. పూర్తిగా ఎండిపోయిన ధాన్యం కాస్తా.. అకాల వర్షాల ధాటికి తడిపోయి.. వరదల్లో కొట్టుకుపోతుంది. దీంతో.. కన్నెర్ర చేసిన రైతులు రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. జనగాం మార్కెట్లో వడ్లు కొనాలి అంటూ రైతులు, కమ్యూనిస్టు నేతలు ఆందోళన చేశారు. ఆ సమయంలో వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు రాగా.. అక్కడే ఉన్న ఓ మహిళా రైతు.. "మీ బాంచన్ వడ్లు కొనండి సారూ.." అంటూ పోలీసుల కాళ్లు మొక్కుతుండటం అందరి గుండెలను మెలిపెట్టేసింది.


ఈ దృశ్యం చూసైనా.. అధికారులు, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను వర్షాలపాలు కాకుండా.. ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే సరైన నీరు అందక.. అంతంత మాత్రమే పంట పండిందని.. వచ్చిన దిగుబడి కూడా ఇలా అకాల వర్షాల పాలైతే.. రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM