సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం,,,,ముహుర్తంలో స్వల్ప మార్పు

byసూర్య | Wed, Dec 06, 2023, 07:36 PM

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు (డిసెంబర్ 7) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌చే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు ఏఐసీసీ సభ్యులు హాజరుకానున్నారు. అయితే ప్రమాణస్వీకారం చేసే ముహుర్తంలో స్వల్ప మార్పులు చేశారు. ముందుగా ఉదయం 10.28 నిమిషాలకు ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పగా.. ఆ సమయాన్ని మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చారు. ఇక ఈనెల 9న తలపెట్టిన ధన్యవాద సభను కూడా రద్దు చేశారు. రేపటి ప్రమాణ స్వీకార సభనే ధన్యవాద సభగా భావిస్తున్నామని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.


డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వెలువడిన దినమని.. అదే రోజు. సోనియా గాంధీ జన్మదినం ఉండటంతో ఆరోజే పెద్ద ప్రోగ్రాం పెట్టాలనుకున్నాం.. కానీ రేపటి ప్రమాణస్వీకారోత్సవ సభనే ధన్యవాద సభగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు తరలివస్తుండటంతో రేపటి కార్యక్రమమే ముఖ్యమైనది చెప్పారు. అతిథులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి 50 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరామని చెప్పారు.


అతిథులు వీరే..


సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛతీస్‌ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్, గతంలో ఇంఛార్జ్‌లుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలకు ఆహ్వానం పంపించారు.


ఇక తెలంగాణ అమరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం పంపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తుండగా.. ఆయన వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్‌తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, పలువురు సినీ నటులు, హైకోర్టు చీఫ్ జస్టిస్, వివిధ కుల సంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.



Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM