తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి

byసూర్య | Sat, Jan 11, 2020, 06:12 PM

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆపరేషన్ రెబల్స్ మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఘటంలో నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో... టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా చేయడంపై కేటీఆర్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీలో నిలిచిన రెబల్స్‌ జాబితాతో వెంటనే తనను కలవాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కేటీఆర్ ఆదేశించారు.


దీంతో జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా... రెబల్స్ జాబితాతో కేటీఆర్‌ను కలుస్తున్నారు. రెబల్స్‌ను ఏ రకంగా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలనే దానిపై ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో రెబల్స్ బెడద నివారణకు కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


తెలంగాణలో అతిపెద్ద పార్టీగా వున్న టీఆర్ఎస్‌లోనే రెబల్స్ బెడద అధికంగా ఉంది. కొన్ని డివిజన్లు, వార్డుల్లో అయితే ఏకంగా అయిదు నుంచి ఆరు మంది చొప్పున ఒక్క టిఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో చాలా మంది బీ-ఫామ్ తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. వీరంతా బరిలోనే కొనసాగితే.. టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు షాక్ తగిలే అవకాశం వుంది. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే రంగంలో నిలిచిన రెబల్స్ అభ్యర్థులపై సంబంధిత ఎమ్మెల్యేలతో సమాలోచనలు మొదలు పెట్టారు కేటీఆర్.


ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి పలువురు ఎమ్మెల్యేలతో నేరుగాను, మరికొందరితో ఫోన్‌లోను మాట్లాడుతూ.. రెబల్స్ బెడదను వీలైనంత మేరకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాల్లో రెబల్స్ బెడద ఎక్కువగా వుండడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కేటీఆర్ కాల్ చేసి, డైరెక్షన్ ఇచ్చారు. దాంతో ఆయన రెబల్స్‌ని బుజ్జగించే పనిలో బిజీ అయిపోయారు. దాంతో ఆయన విజయం సాధించే సమీకరణలను గణించే పనిలో పడ్డారు. రెబల్స్‌ని బుజ్జగించేందుకు ఆయన నామినేటెడ్ పదవులను ఎరగా వేస్తున్నారు. పోటీ చేయాలని అందరికీ వుంటుంది. వారందరికీ టిక్కెట్ రాదు.. ఏ ఒక్కరికో దక్కుతుంది.. మిగిలిన వారు సహకరించి, పార్టీ అభ్యర్థి విజయానికి పాటుపడాలంటూ బుజ్జగింపు చర్యలను ముమ్మరం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు.


పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికి ఏదో ఒకరూపంలో గుర్తింపు లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని కేటీఆర్ వారికి సూచించారు. దాంతో శని, ఆదివారాల్లో బుజ్జగింపులపై దృష్టి సారించే బాధ్యతలను ఆయన ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు. ఈ బుజ్జగింపుల పర్వాన్ని హైదరాబాద్ నుంచి క్షణక్షణం కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో తిష్ట వేసిన కేటీఆర్.. ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు.


కేటీఆర్ పిలుపు మేరకు రెబల్స్ వెనుక వున్నారనుకుంటున్న నాయకులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ఫిర్యాదు చేయడంతో ఆయనను పిలిపించి రెబల్స్‌ని విత్ డ్రా చేయించే పని అప్పగించారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మంత్రి తలసాని సంధి కుదర్చినప్పటికీ.. మహేందర్ రెడ్డి వర్గం వారు పెద్ద ఎత్తున రెబల్స్‌గా బరిలో దిగారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేటీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ శివారులోని బడంగ్‌పేట మున్సిపాలిటీలో తీగల కృష్ణారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున రెబల్స్‌గా బరిలో దిగడంతో వారితోను కేటీఆర్ సంప్రదింపులు మొదలుపెట్టారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM