మాకెందుకివ్వరు టీకా...కోర్టుకెక్కిన 12 ఏళ్ల బాలిక

by సూర్య | Tue, Jan 18, 2022, 08:08 PM

మాకెందుకివ్వరు టీకా అంటూ  ఓ పన్నెండేళ్ల బాలిక ఏకంగా కోర్టు కెక్కింది.  కోవిడ్-19 వ్యాక్సిన్ తమకూ వేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 12 ఏళ్ల బాలిక ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 12ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీకి చెందిన తియా గుప్తా (12) తన వ్యాజ్యంలో కోరింది. ప్రస్తుతం 15 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకే వ్యాక్సిన్ ఇస్తున్నారని, 12ఏళ్లలోపు చిన్నారుల వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి రోడ్ మ్యాప్ లేదని పేర్కొంది.  ‘‘గత రెండేళ్లుగా పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం.. చాలా మంది పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రోడ్‌మ్యాప్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు.. 12, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఇతర దేశాలలో విద్యార్థులు టీకా వేసుకుని పాఠశాలకు వెళ్లడం మనం చూస్తున్నాం... కాబట్టి మన దేశంలో రోడ్‌మ్యాప్ ఎప్పుడు విడుదల చేస్తారు’’ అని తియా గుప్తా నిలదీసింది. టీకా వేసుకుంటే సురక్షితమేనని భావిస్తున్నావా? అని అడిగితే ‘కచ్చితంగా.. చాలా శాస్త్రీయ సమాచారం ఉంది.. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు కోవిడ్-19 నుంచి రక్షణ పొందుతారు.. కానీ, ఒమిక్రాన్ విషయంలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి కాబట్టి నేను కచ్చితంగా చెప్పలేను’’ అని సమాధానం ఇచ్చింది. బాలిక పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. మార్చి 22న విచారణ చేపట్టనుంది. అయితే, క్లినికల్ ట్రయల్స్ లేకుండా పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల విపత్తుకు దారితీస్తుందని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. క్లినికల్ ట్రయల్స్ త్వరగా పూర్తయితే 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ కోసం దేశం యావత్తు ఎదురుచూస్తోందని పేర్కొంది. అందరికీ టీకాలు వేయడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని కేంద్రం తరఫున అఫిడ్‌విట్ దాఖలు చేసిన న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియా తెలిపారు. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం పేర్కొంది. గతేడాది ఏప్రిల్- మే 2021 మధ్య డేటా ప్రకారం.. 2020 కంటే కోవిడ్ బారినపడ్డ పిల్లల సంఖ్య ‘విపరీతంగా పెరిగిందని’ పిటిషనర్ పేర్కొన్నారు.

Latest News

 
ఈనెల 23 నుంచి సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ Sun, May 19, 2024, 11:16 AM
ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలి Sun, May 19, 2024, 11:15 AM
దసబుజ వినాయకుడికి టిడిపి శ్రేణులు పూజలు Sun, May 19, 2024, 11:05 AM
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు Sun, May 19, 2024, 10:59 AM
రైతు భరోసా కేంద్రంలో రైతులకు జీలగులు, జనములు పంపిణీ Sun, May 19, 2024, 10:03 AM