by సూర్య | Fri, Oct 25, 2024, 03:02 PM
వైఎస్సార్ అభిమానులకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ ఎప్పుడూ తనను తక్కువ చేసి చూడలేదన్న షర్మిల... ఆయన సమాన వాటా ఉండాలని అనేవారని చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ ఉన్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని ఆమె స్పష్టం చేశారు. ఆయన స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదన్నారు. అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ 'గార్డియన్' మాత్రమేనని షర్మిల తెలిపారు. నలుగురికి సమానంగా పంచి పెట్టాలనేది జగన్ బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ ఉద్దేశమేంటో కుటుంబ సభ్యులకు, సన్నిహితులందరికీ తెలుసని అన్నారు. ఆయన బతికి ఉన్నంతవరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదని తెలిపారు. అలాగే వైఎస్ మరణించాక కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదన్నారు. ఇవాళ్టి వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని షర్మిల వాపోయారు. వైఎస్ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాననేది హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదన్నారు. కేవలం తన బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలనేది వైఎస్ అభిమతంగా షర్మిల పేర్కొన్నారు.
Latest News