by సూర్య | Thu, Jul 11, 2024, 05:16 PM
ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా నిబందనల ప్రకారం ఇసుక పంపిణీ జరుగుతుందని పెదకూర పాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వైకుంఠపురం ఇసుక రీచ్‌ను ప్రవీణ్ సందర్శించారు. ఇసుక బుకింగ్, లోడింగ్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇసుక పాలసీ వలన ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఫాలసీని తీసుకు వచ్చిందని అన్నారు. పేదల గృహ నిర్మాణానికి, కార్మికుల ఉపాధికి మార్గం సుగమం కావడంతో ఆయా వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు వైకుంఠపురం రీచ్ నుండి 2800 టన్నుల ఇసుక లోడింగ్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, మైనింగ్ ఏడీ నాగిని, తహసీల్దార్ వెంకటరమణారావు, ఎంపీపీ హనుమంత రావు, సర్పంచ్ ఎం విఠల్‌రావు, పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్‌బాబు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Latest News