by సూర్య | Wed, Jul 10, 2024, 02:19 PM
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.. మరిసా అప్పలనాయుడు (45)కు భార్య లక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. అప్పలనాయుడు సుమారు ఎకరా సొంత భూమితో పాటు కొంత కౌలుకు తీసుకుని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణానికి కొంత అప్పుచేశారు. వ్యవసాయంతో పాటు ఇంటి నిర్మాణానికి సుమారు రూ.15 లక్షలు అప్పు చేయడంతో వడ్డీలు పెరిగిపోయాయి. సాగు కలిసి రాకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పొలంలోనే పురుగులు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన తోటి రైతులు కుటుంబీకలకు సమాచారం ఇవ్వగా, వారు హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు రిఫర్ చేయగా, పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పలనాయుడు మంగళవారం మృతిచెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ డి.ఈశ్వరరావు తెలిపారు.
Latest News