జగన్‌పై రాయి దాడి ఘటన.. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్

by సూర్య | Sun, Apr 14, 2024, 04:14 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆరా తీసిన ఈసీ.. పూర్తి వివరాలతో నివేదిక కోరింది. ఇదే సమయంలో ఎన్నికల వేళ వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేసింది. గత నెల చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ సభ, విజయవాడలో సీఎం జగన్ రోడ్‌షోలో రాళ్లదాడిపై పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఐజీ, ఎస్పీలపై ఈసీ వేటువేసింది.


ఈసీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు. దర్యాప్తునకు 20 మంది సిబ్బందితో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.


ఇక, సీఎంపై దాడి ఘటనతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేతల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు సీఎం సెక్యూరిటీ, ఎస్కార్ట్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో భద్రత కల్పిస్తారు. వీళ్లతో పాటు స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనంగా ఉంటుంది. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Latest News

 
స్వామి వివేకానంద ప్రేరణలు దేశానికి గర్వకారణం Sun, Jan 12, 2025, 11:01 PM
సంక్రాంతికి ఇస్తా అన్న, సంతోషం ఏదయ్యా? Sun, Jan 12, 2025, 11:00 PM
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం మంగళం Sun, Jan 12, 2025, 10:59 PM
ప్రచారం తప్ప చేసింది ఏమైనా ఉందా...? Sun, Jan 12, 2025, 10:58 PM
తిరుమల ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బతీశారు Sun, Jan 12, 2025, 10:58 PM