హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష

byసూర్య | Wed, Oct 23, 2024, 11:17 PM

గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు చెబితేనే చాలా మంది గుండెల్లో వణుకు పుడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను అమలు చేయాలని కొన్ని వర్గాలు కోరుతుండగా.. మరోవైపు.. హైడ్రాపై విమర్శలు కూడా ఆ స్థాయిలోనే వెల్లువెత్తుతున్నాయి. ఇక పొరుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలు అవుతున్న హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలని అక్కడి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైడ్రా తెలంగాణలో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ.. హైడ్రా నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఇటీవలె హైకోర్టు కూడా హైడ్రా ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ఇక నగరంలోని అక్రమ కట్టడాల భరతం పడతామని హైడ్రా చెప్పగా.. దానికి మరిన్ని అధికారాలు కూడా ప్రభుత్వం కట్టబెట్టింది.


హైదరాబాద్ న‌గ‌రంలో వృక్షాల ప‌రిర‌క్షణ‌తో పాటు ప్రమాద‌క‌రంగా కూలిపోయే దశలో ఉన్న వృక్షాలకు సంబంధించి ఏవీ రంగ‌నాథ్ స‌మావేశం జరిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫారెస్ట్ అధికారులతో జోన్ల వారీగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టీమ్‌లు క్షేత్రస్థాయిలో వృక్షాల స్థితిపై స‌ర్వే చేయాలని పేర్కొన్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పైనా స‌మీక్షించారు. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.


తెలంగాణ వాల్టా (వాట‌ర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్‌) చ‌ట్టం అమ‌లు అవుతున్న విధానాన్ని ప‌రిశీలించాలని నిర్ణయించారు. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ జ‌రుగుతున్న తీరు, 100 శాతం చెట్లు బ‌తికేలా తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పైనా దృష్టి సారించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. ఎండిపోయి, కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను గుర్తించి.. వెంటనే ఎలాంటి నష్టం జ‌ర‌గ‌క‌ముందే తొల‌గించాలని తెలిపారు.


ఇక నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెట్లు, మొక్కలు అంతరాయం కలిగించకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా, కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్లు, వృక్షాలను గుర్తించ‌డం.. ఎలాంటి ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా ఆయా డిపార్ట్‌మెంట్లు తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి చర్చించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతున్న చెట్ల కొమ్మల‌ను కొట్టేయడం, ఇంకా ఇబ్బందిగా ఉంటే ఆ చెట్టును పూర్తిగా తీసి వేరే చోటుకు త‌ర‌లించి ట్రీ ప్లాంటేష‌న్ విధానంలో మళ్లీ పెంచాలని అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. చెట్లు తొల‌గించిన చోట మరిన్ని మొక్కలు నాట‌డం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.


ఇక కరెంట్ తీగ‌ల‌కు చెట్లు, కొమ్మలు త‌గులుతున్నాయ‌నే కారణంతో ఇష్టం వచ్చినట్లు చెట్లను, వాటి కొమ్మలను న‌ర‌క‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఏవీ రంగనాథ్ సూచించారు. వాహ‌నాల‌కు త‌గులుతున్నాయ‌నే కారణంతో చెట్ల కొమ్మలను ఒక వైపే తొల‌గించ‌డం వ‌ల్ల.. అవి పట్టు తప్పిపోయి.. కూలిపోయే ప్రమాదం ఉందని.. అందుకే కొమ్మలను తొల‌గించ‌డంలో శాస్త్రీయ విధానాల‌ను అనుస‌రించ‌డం సహా పలు అంశాల‌పై సమీక్షలో చర్చించారు.



Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM