మీకూ.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం,,,,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

byసూర్య | Tue, Oct 22, 2024, 07:02 PM

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావటం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న గంగారెడ్డిని జాబితాపూర్ శివారులో సంతోష్ అనే కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపేశారు. తీవ్ర గాయాలపాలైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గంగారెడ్డి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. జగిత్యాల-ధర్మపురి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంగారెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ అధికారంలో ఉంటే..జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోందని ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.


ఇక జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మీకూ.. మీ కాంగ్రెస్ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తా అని అన్నారు. ఇలా అయినా మమ్మల్ని బతకనివ్వండని వేడుకున్నారు.


'కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని మమ్మల్ని చంపేస్తున్నారు. ఇంతకాలం మానసిక అవమానాలకు గురవుతున్నా కానీ తట్టుకున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?.. లేవా? కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా? కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా? ప్రాణహాని ఉందని తెలిపినా.. పోలీసులు ఏం చేశారు. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి రౌడీషీటర్. 20 కేసులున్నా అతన్ని పట్టుకోలేదు.' అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


విషయం తెలుసుకున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయనపైనా జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. 40 ఏళ్ల పార్టీని నమ్ముకుంటే చివరకు మిగిలిందేంటని ప్రశ్నించారు. దయచేసి తనను క్షమించాలని తాను పార్టీలో ఉండలేనంటూ మహేష్ కుమార్ ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేశారు. గంగారెడ్డి హత్య ఘటనపై జగిత్యాల జిల్లా ఎస్పీకి కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఘటనపై విచారణ జరిపి నిందితుడిని శిక్షించాలని సూచించారు.


Latest News
 

హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు Tue, Oct 22, 2024, 08:46 PM
జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడి Tue, Oct 22, 2024, 08:45 PM
భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్ Tue, Oct 22, 2024, 08:43 PM
రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM