ఆ నిర్మాణాలేవీ కూల్చబోం.. హైడ్రా సంచలన నిర్ణయం

byసూర్య | Sun, Sep 08, 2024, 07:35 PM

హైదరాబాద్ హైడ్రా హడలెత్తిస్తోంది. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించటంలో భాగంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తూ.. అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తోంది. సామాన్యులు, బడావ్యక్తులు అని తేడా లేకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్ అని తెలియక.. స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్న సామాన్యుల్లో భయం నెలకొనగా.. వారి నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది.


హైడ్రా కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేఖత వస్తున్న నేపథ్యంలో.. పలు అంశాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఇప్పటికే నిర్మించి.. అందులో నివాసముంటున్న ఇండ్లను ఎట్టిపరిస్థితుల్లో కూల్చబోమని.. రంగనాథ్ స్పష్టం చేశారు. కేవలం ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్‌లో నిర్మిస్తున్న కొత్త కట్టాడాలను మాత్రమే కూల్చివేయనున్నట్టు స్పష్టం చేశారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువులో ఈరోజు కూల్చివేసిన కట్టడాలన్ని.. నిర్మాణ దశలోనే ఉన్నాయని.. అవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్నారని చెప్పుకొచ్చారు.


ఇక.. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలు కూడా.. అక్రమణకు గురైనవేనని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలు కూడా అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేశారు. సున్నం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాణిజ్యపరమైన షెడ్లను కూల్చేశామని తెలిపారు. అలాగని.. జనాలు నివాసముంటున్న ఇండ్లను కూల్చివేయమని మరోసారి క్లారిటీ ఇచ్చారు.


  మల్లంపేట చెరువు, దుండిగల్‌లో కూల్చిన 7 విల్లాలు కూడా ఇప్పటికీ నిర్మాణంలోనే ఉన్నాయని.. అందులో ఏ కుటుంబాలు నివాసముండట్లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినవేనని తెలిపారు. సున్నం చెరువులోని నిర్మాణాలు గతంలో కూడా కూల్చివేయబడ్డాయని.. కానీ వాటిని మళ్లీ నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. నివాసముంటున్న ఏ ఇంటిని కూల్చబోమని హైదరాబాద్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు.


ఏదేమైనప్పటికీ, ఏదైనా సరస్సు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉన్న ఇల్లు/ఫ్లాట్/భూమిని కొనుగోలు చేయవద్దని నగరవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. అటువంటి ఆస్తుల కొనుగోలుదారులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లకు సంబంధించి ఏదైనా సందేహం ఉంటే హెచ్ఎండీఏ సరస్సుల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని లేదంటే అధికారులను సంప్రదించి పూర్తి క్లారిటీ వచ్చాకే కొనుగోలు చేయాలని రంగనాథ్ సూచించారు.


హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ప్రకటనతో.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు సురక్షితమేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే.. తిరుపతి రెడ్డి ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని.. హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తన నివాసం బఫర్ జోన్‌లో ఉందని తనకు తెలియదని.. ఆ నివాసాన్ని తాను 2017లోనే కొనుగోలు చేశానని.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కాగా.. ఇప్పుడు రంగనాథ్ ఇచ్చిన స్టేట్ మెంట్‌తో.. తిరుపతి రెడ్డి ఇళ్లు సేఫేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM