వాళ్ల మధ్య జరిగిన ఒప్పందం ఇదే.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి: హరీష్ రావు

byసూర్య | Sat, May 04, 2024, 07:12 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న హరీష్ రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన బాండు పేపర్ బౌన్స్ అయిందని.. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారన్నారు. అప్పుడు బాండు ప్రామిస్‌లు.. ఇప్పుడు దేవుళ్లపై ప్రామిస్‌లు చేస్తున్నారంటూ విమర్శించారు. హామీలు అమలు కావడడం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారని మండిపడ్డారు.


ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ.. హామీల అమలుపై పరిపాలనపై లేదంటూ హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు దుయ్యబట్టారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడని.. ఇది ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయన్నారు.


ప్రజాపాలనలో 3 లక్షల 50 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా రేవంత్ పెడ్డి పని చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటినే ప్రోత్సహిస్తోందన్నారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా ఒకరికొకరు ప్రోత్సాహించుకునేలా రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయంటూ హరీష్ రావు ఆరోపించారు.


 హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని.. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదని.. వడ్లు కొనమంటే నూకలు తినండి అని కేంద్ర మంత్రులు అహంకారం ప్రదర్శించారన్నారు. తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా కేసీఆర్ మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారన్నారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందంటూ నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు.. ఏ ఒక్క వర్గానికీ బీజేపీ మేలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కిట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చారన్నారు.


భక్తి ధార్మికం గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని... కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. యాదాద్రిని అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారన్నారు. ఆధ్యాత్మికంలో ఆయన బీజేపీ కంటే రెండు అడుగులు ముందు ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబులు వస్తాయా అంటూ మండిపడ్డారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని.. పరిశ్రమలు ఇబ్బందుల పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయన్నారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు.


Latest News
 

హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం Sat, May 18, 2024, 03:51 PM
ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి Sat, May 18, 2024, 03:18 PM
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం Sat, May 18, 2024, 03:18 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన Sat, May 18, 2024, 01:58 PM
ఈశ్వర్ కు ఆహ్వాన పత్రిక అందజేత Sat, May 18, 2024, 01:38 PM