కాంగ్రెస్ నేత దారుణ హత్య.. మహిళను రంగంలోకి దింపి ట్రాప్, సినీఫక్కీలో స్కెచ్

byసూర్య | Thu, May 02, 2024, 07:55 PM

సూర్యాపేట జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మహిళను రంగంలోకి దింపి ట్రాప్ చేసిన ప్రత్యర్థి ఆయన్ను కిరాతకంగా హత్య చేశాడు. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అంతమెుందించి.. చేపలు తరలించే లోడ్‌లో మృతదేహాన్ని విశాఖకు పార్సిల్ చేశాడు. గత నెల 18న ఎల్లయ్య అదృశ్యం కాగా.. తాజాగా అతడు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.


సినీఫక్కీలో వేసిన మర్డర్ స్కెచ్‌ను పోలీసులు మీడియాకు వివరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన వడ్డే ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఈయన భార్యభర్తల మధ్య పంచాయితీలను, చిన్న చిన్న వివాదాలను సెటిల్ చేసేవాడు. అయితే ఎల్లయ్యకు మాజీ నక్సలైట్ అయిన శ్రీకాంతాచారికి మధ్య రియల్‌ఎస్టేట్‌ భూవివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లయ్యను మర్డర్ చేసేందుకు స్కెచ్ వేశాడు. అందుకు ఓ మహిళను రంగంలోకి దింపాడు. తన భర్త శ్రీనివాస్‌తో వివాదాలున్నాయని అపర్ణ అనే మహిళ గత ఎల్లయ్యను కలిసింది. అతని నుంచి రూ.20 లక్షలు రావాలని, వాటిని ఇప్పించాలని కోరింది. ఈ పంచాయితీని సెటిల్ చేసేందుకు ఎల్లయ్య సిద్ధమయ్యారు.


ఏప్రిల్ 18న వీరు కారులో ఏపీలోని జగ్గయ్యపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఎల్లయ్య తన స్నేహితుడు అంజయ్యను కారులో ఎక్కించుకున్నారు. శ్రీకాంతాచారి, అపర్ణ భర్తగా చెప్పిన అతని స్నేహితుడు శ్రీనివాస్ మరికొందరు స్నేహితులు అంతకు రెండ్రోజుల ముందే జగ్గయ్యపేటలో మకాం పెట్టారు. ఎల్లయ్య, అపర్ణ, అంజయ్య జగ్గయ్యపేటకు రాగానే.. శ్రీనివాస్‌ వారికి ఫోన్‌ చేశాడు. ఒంటరిగా తన వద్ద ఉన్న రూ.20 లక్షలు ఇస్తానని ఎల్లయ్యకు చెప్పాడు. దాంతో ఎల్లయ్య తన వెంట ఉన్న అంజయ్య, అపర్ణను ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద దింపేసి, ఒంటరిగా శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. ఇంతలోనే వాష్‌రూమ్‌ పేరుతో అపర్ణ కనిపించకుండా పోయింది. అంజయ్య తన స్నేహితుడు ఎల్లయ్య, శ్రీనివాస్‌లకు ఫోన్ చేసినా స్పందన లేదు. అపర్ణ ఫోన్‌ కూడా స్వి్చ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన అంజయ్య వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.


ఎల్లయ్య కనిపించకుండా పోవటంతో ఆయన సోదరుడు సతీశ్‌ సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో శ్రీకాంతాచారిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో అతడు నేర ఒప్పుకున్నాడు. ఎల్లయ్యను జగ్గయ్యపేట పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌లో హత్యచేసి.. డెడ్ బాడీని చేపలను పార్సిల్‌ చేసే బాక్సులో పెట్టి, విశాఖకు తరలించినట్లు ఒప్పుకున్నాడు. ఎల్లయ్య మృతదేహాన్ని విశాఖ తీరంలో సముద్రంలో పారేసినట్లు అంగీకరించాడు.


అతడి వాంగ్మూలం మేరకు మృతదేహం కోసం సముద్రతీరంలో, జగ్గయ్యపేట అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాస్‌, ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాన నిందితుడు శ్రీకాంతాచారిపై ఏపీ, తెలంగాణల్లో 34కు పైగా కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు.



Latest News
 

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే Fri, May 17, 2024, 03:32 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 03:31 PM
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు Fri, May 17, 2024, 03:30 PM
వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 02:55 PM
మహబూబాబాద్ లో అశోక్ ప్రచారం.. భారీ స్పందన Fri, May 17, 2024, 02:50 PM