10 ఎంపీ సీట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్ ఏం చేయగలదో చూపిస్తాం: కేటీఆర్

byసూర్య | Tue, Apr 23, 2024, 07:19 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల నేతలంతా బరిలోకి దిగి.. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు, సవాళ్ల పర్వాలు జోరందుకున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. లోక్ సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోతాయంటూ కేసీఆర్ దగ్గరి నుంచి బీఆర్ఎస్ నేతలంతా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 10 ఎంపీ స్థానాలు ఇస్తే.. తాము ఏం చేయగమో చేసి చూపిస్తామంటూ చెప్పుకొచ్చారు.


నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీ రామారావు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఇక నుంచి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమారని.. ఆయన్ని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు.. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. దేవుడు అందరివాడని.. కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదన్నారు. దేవుడి అక్షితలతోనూ బీజేపీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల అభివృద్ధికి ఏం చేసిందంటూ కేటీఆర్ ప్రశ్నించారు. చేసిన అభివృద్ధి చెప్పలేకనే జై శ్రీరాం అనే నినాదాన్ని ఎత్తుకున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


మరోవైపు.. కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే.. 100 రోజుల్లోనే చేతులు ఎత్తేశారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా టైంపాస్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 10 స్థానాల్లో గెలిపించండి.. దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేస్తామంటూ కేటీఆర్ అభ్యర్థించారు. గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలుపొందుతామన్న ధీమాను కేటీఆర్‌ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయనే విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM