కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది.. గులాబీ శిబిరం లెక్కలివే

byసూర్య | Fri, Dec 01, 2023, 08:47 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సమయం ముగియగానే సర్వే సంస్థలు రంగంలోకి దిగి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారని కూడా ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో మొగ్గు కాంగ్రెస్ వైపు కనిపించడంతో.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలొస్తాయని చెబుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడాన్ని తప్పుబట్టారు. 2018లోనూ ఎగ్జిట్ పోల్స్‌ తప్పయ్యాయని.. ఈసారి కూడా తమ పార్టీ 70కిపైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


సొంతంగానే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ.. హంగ్‌పై వారు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయదో కూడా చెబుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 29 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో తమ పార్టీ 15 స్థానాల దాకా గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం 6-7 స్థానాలు గెలిచే అవకాశం ఉండగా.. బీజేపీ 4-7 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మిగతా 88-91 స్థానాల్లోనే 60 సీట్లు గెలవాల్సి ఉంటుందని.. అంటే 70 శాతం సీట్లను హస్తం పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుందని.. ఇది సాధ్యం కాదంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 73 శాతానికిపైగా పోలింగ్ నమోదు కాగా.. ఈసారి అది 71 శాతానికే పరిమితం అవుతోందని.. కాంగ్రెస్‌కు 8-20 శాతం మొగ్గు రాని పక్షంలో ఆ పార్టీ మెజార్టీ మార్క్‌ను చేరుకోవడం సాధ్యం కాదని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెరగనప్పుడు ఒకే పార్టీకి స్వింగ్ రావడం కష్టమవుతుందంటున్నారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ 60కిపైగా స్థానాల్లో 30 వేలకుపైగా మెజార్టీ సాధించిందని.. కాబట్టి ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మా్ల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


కాగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖమ్మం, నల్గొండ జిల్లాలను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని.. మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనే 45 సీట్లకుపైగా కాంగ్రెస్ సాధించే అవకాశం ఉందని చెబుతున్నాయి. అలాంటప్పుడు వేవ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అదీగాకుండా పోలింగ్ తక్కువగా నమోదైంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే. మిగతా జిల్లాల్లో పోలింగ్ బాగానే నమోదైంది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM