శాంతి కోసం మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదావేసుకున్న ముస్లిం మతపెద్దలు

byసూర్య | Wed, Sep 20, 2023, 07:53 PM

గంగా జమునా తహజీబ్ సంస్కృతికి నిదర్శనమని మన భాగ్యనగరం మరోసారి నిరూపించింది. ఒకే రోజు హిందూ, ముస్లిం పండగలకు సంబంధించిన ఊరేగింపులు రావడంతో.. సామాన్యులు ఆందోళన చెందుతున్న వేళ, పోలీసులు తర్జనభర్జన పడుతున్న వేళ ముస్లిం మత పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పండుగను అక్టోబర్ 1కి వాయిదా వేసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హిందూ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు..


ఈ ఏడాది ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ సెప్టెంబర్ 28న వచ్చింది. మహ్మద్ ప్రవక్త జన్మదినం అయిన ఈ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకుంటారు. త్యాగానికి ప్రతీకగా కొరడాతో కొట్టుకుంటూ.. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. ఇదే రోజు వినాయక నిమజ్జనం జరుగనుంది. చార్మినార్ సహా పాతబస్తీలోని పలు ప్రాంతాల మీదుగా ‘గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర’ కొనసాగుతోంది. మరుసటి రోజు సాయంత్రం వరకూ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. సుమారు 35 ఏళ్ల తర్వాత ఈ రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి.


ముస్లింలు, హిందువులకు సంబంధించిన పండుగలు ఒకేసారి రావడంతో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మత పెద్దలను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలు పాతబస్తీలో సమావేశమయ్యారు. మహ్మద్ ప్రవక్త జన్మదిన ఊరేగింపును అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకునేందుకు మూకుమ్మడిగా నిర్ణయించారు. సమావేశం అనంతరం ప్రకటన చేశారు.


‘ఇస్లాంను అనుసరించేవాడే ముస్లిం. ఇస్లాం అంటే త్యాగానికి ప్రతీక. మంచి కోసం దేన్నైనా త్యాగం చేయాల్సిందే. అదే మాకు, ఇస్లాంకు గౌరవం. శాంతి గురించి, అందరి మంచి గురించి ఆలోచించి, త్యాగానికి ప్రతీక అయిన మిలాద్ ఉన్ నబీ పండుగను వాయిదా వేసుకునేందుకు నిర్ణయించుకున్నాం’ అని సమావేశం అనంతరం మాట్లాడుతూ ముస్లిం మత పెద్ద ఒకరు తెలిపారు. ముస్లిం మత పెద్దలకు హిందూ మత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. సుహృద్భావంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గంగా జమునా తహజీబ్ సంస్కృతికి నిదర్శనమని హైదరాబాద్ మరోసారి నిరూపించిందని అన్నారు.


ఈ నిర్ణయంతో పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉన్నతాధికారులతో కలిసి హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం (సెప్టెంబర్ 20) మూడో రోజు కావడంతో నిమజ్జనానికి సాగర తీరానికి విగ్రహాలు తరలివస్తున్నాయి.


Latest News
 

షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Sun, Oct 27, 2024, 12:05 PM
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM