నీలోఫర్‌ ఆసుపత్రిలో అపహరణకు గురైన చిన్నారి ,,,,,మహిళ కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని రక్షించిన పోలీసులు

byసూర్య | Wed, Sep 20, 2023, 06:57 PM

హైదరాబాద్ నిలోఫర్‌ ఆసుపత్రి లో 6 నెలల చిన్నారి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు బాబును రక్షించారు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమత తన భర్త శ్రీనివాస్‌తో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. మమతకు ఇదివరకే ఇద్దరు మగ బిడ్డలు పుట్టి చనిపోగా.. మూడో కాన్పులో పుట్టిన మరో మగ బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇదే సమయంలో ఆస్పత్రిలో తనను చూసి నవ్విన చిన్నారిని మమత అపహరించి తీసుకెళ్లింది. బాబును పెంచుకుందామనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు పోలీసులకు తెలిపింది.


‘మమత, ఆమె భర్త శ్రీనివాస్ బాబును కిడ్నాప్ చేశారు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి వరుసగా చనిపోతున్నారు. 15 రోజులు కిందట ఈ దంపతులకు బాలుడు పుట్టాడు. దీంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. అధిక రక్త స్నిగ్థత అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఆ చిన్నారి కూడా బతికే అవకాశం లేదని డాక్టర్లు తెలిపారు’ అని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఇదే సమయంలో ఫరీదా బేగం తన పెద్ద కుమారుడు అస్వస్థతకు గురవ్వడంతో నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించింది. ఆ పిల్లాడి దగ్గర భర్త ఉండగాా.. 6 నెలల రెండో కుమారుడు ఫైసల్‌ఖాన్‌ను ఆడిస్తూ కారిడార్‌లో ఉంది. మమతను చూసి ఆ బాలుడు నవ్వాడు. దీంతో ఆ చిన్నారిని తీసుకెళ్లాలని మమత భావించింది. భర్తతో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్ వేసింది.


పిల్లాడిని ఆడిస్తున్న ఫరీదా బేగం వద్దకు వెళ్లి మాటలు కలిపింది మమత. ఇంతలో ఫరీదా బేగం భోజనం కోసం వార్డులోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన మమత.. ఆ బాలుడిని తీసుకొని ఆస్పత్రి నుంచి పారిపోయింది. భర్తతో కలిసి ఆ బాలుడిని బాన్సువాడ తీసుకెళ్లి అక్కడే ఉంచారు. బాలుడుకి రెండు రోజులపాటు నిందితురాలు మమతనే చనుబాలు ఇచ్చింది. నిలోఫర్ హాస్పిటల్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి నిందితులను గుర్తించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుల ఫోన్ లోకేషన్ ఆధారంగా లోకేషన్‌ను గుర్తించారు. కిడ్నాప్‌కు గురైన బాలుడు అతడేనా, కాదా అని నిర్ధారించుకున్నాక నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ‘ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని తీసుకెళ్లాం’ అని పోలీసులతో మమత చెప్పింది.


మమత, శ్రీనివాస్ అరుదైన సమస్యతో బాధ పడుతున్నారు. వారికి ఉన్న రక్త వర్గానికి సంబంధించిన ఒక సమస్య వల్ల.. మగ బిడ్డలు పుడితే బతకరు. లక్షల మంది దంపతుల్లో ఒక జంటకు ఇలాంటి అరుదైన సమస్య ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ సమస్య వల్ల ఈ దంపతులకు తొలి రెండు కాన్పుల్లో మగ బిడ్డలు పుట్టి చనిపోయారు. మూడో కాన్పులోనూ మగ బిడ్డ జన్మించాడు. అతడు కూడా బతకడని డాక్టర్లు చెప్పడం, ఆ బాధలో ఉన్న భార్యభర్తలకు ఆస్పత్రిలో ఫైసల్ ఖాన్ నవ్వుతూ కనిపించడం.. ఆ తర్వాత కిడ్నాప్‌ ఘటనకు దారి తీశాయి. నిందితులను అరెస్టు చేసినా ప్రస్తుతం వారిని మానవతా దృక్పథంతో నీలోఫర్ ఆస్పత్రిలో ఉండేందుకు అనుమతిచ్చారు పోలీసులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బాబు వద్ద ఉండేందుకు అవకాశం కల్పించారు. హృదయవిదారకమైన వారి వేదన పోలీసులను సైతం కదిలించింది. ఆస్పత్రిలో కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారు. బాబు చికిత్స అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Latest News
 

సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM